- ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు
- కుట్ర, లైంగికదాడి సహా ఐదు సెక్షన్ల కింద ఆరోపణలు
- రూ.1.20 లక్షల సొత్తు దోపిడీకి గురైనట్లు నిర్థారణ
- రిటర్న్ టిక్కెట్‌ను సేకరించిన దర్యాప్తు అధికారులు
- నగరానికి బయలుదేరిన పోలీసులు, బాధితురాలు
సాక్షి, సిటీబ్యూరో: ‘న్యూ ఇయర్’ ఈవెంట్ కోసమంటూ రప్పించి, ముంబై మోడల్‌పై హైదరాబాద్‌లో సామూహిక లైంగికదాడికి పాల్పడిన కేసును వెర్సోవా పోలీసులు ‘జీరో ఎఫ్‌ఐఆర్’గా నమోదు చేశారు. నిందితులపై కుట్ర, సామూహిక లైంగికదాడి సహా ఐదు సెక్షన్ల కింద ఆరోపణలు మోపారు. మోడల్‌కు చెందిన రూ.1.2 లక్షల సొత్తు కూడా దోపిడీకి గురైందని నిర్ధారించారు. ప్రాథమిక ఆధారాల సేకరణ పూర్తి చేసిన పోలీసులు బాధితురాలిని తీసుకుని గురువారం హైదరాబాద్‌కు బయలుదేరారు.
బదిలీ కోసమే ‘జీవో ఎఫ్‌ఐఆర్’
నిబంధనల ప్రకారం నేరం ఏ ఠాణా పరిధిలో జరిగితే కేసును అక్కడే నమోదు చేయడాన్ని జ్యూరిస్‌డిక్షన్ అంటారు. ఇలా నమోదైన ప్రతి ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)కూ ఓ క్రమసంఖ్యను ఇస్తారు. ఎఫ్‌ఐఆర్ జారీ అయిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత కోర్టుకు సమర్పించాలి. ఈ కేసులో బాధితురాలి కథనం ప్రకారం లైంగికదాడి ఉదంతం వెర్సోవాలో జరగలేదు. అయితే పరిధితో సంబంధం లేకుండా ప్రతి ఫిర్యాదునూ కచ్చితంగా స్వీకరించాలని, ప్రాథమిక ఆధారాలు లభిస్తే తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌గా జారీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై జరిగిన నేరాల విషయంలో దీన్ని మరింత పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
మోడల్ ఫిర్యాదును తొలుత తిరస్కరించిన వెర్సోవా పోలీసులు జన్‌శక్తి ఫౌండేషన్ చొరవతో స్వీకరించి కేసు నమోదు చేశారు. అయితే నేరం జరిగింది వారి పరిధిలో కాదు కాబట్టి సంబంధిత ప్రాంతానికి బదిలీ చేసేందుకు అనువుగా సదరు ఎఫ్‌ఐఆర్‌కు ఎలాంటి నెంబరు కేటాయించలేదు. దీనివల్ల ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన వెంటనే కేసును కోర్టుతో నిమిత్తం లేకుండా నేరుగా నేరం జరిగిన ప్రాంతానికి బదిలీ చేసే అవకాశం ఏర్పడుతుంది. దీన్నే ‘జీవో ఎఫ్‌ఐఆర్’గా పరిగణిస్తారు.
బాధితురాలి నుంచి ఆధారాల సేకరణ
లైంగికదాడికి గురైన మోడల్‌కు వెర్సోవా పోలీసులు బుధవారం రాత్రి అంధేరీలోని కూపర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అందులోనే ఇన్-పేషెంట్‌గా చేర్చారు. గురువారం ఆమెను మరోసారి విచారించిన పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరిన్ని ఆధారాలూ సేకరించారు. లైంగికదాడి అనంతరం మగతలో ఉన్న తనను ముంబై తిప్పి పంపేందుకు ముష్కరులు కొండాపూర్‌లో ఉన్న జెన్ జబ్బార్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో బస్సు టిక్కెట్ కొన్నారని పోలీసులకు తెలిపిన బాధితురాలు ఆధారాన్ని సైతం అందించింది.
అందులో టిక్కెట్ కొన్న వ్యక్తిగా మంజూర్ పేరు ఉన్నట్లు వెర్సోవా అధికారులు గుర్తించారు. విమానాశ్రయం నుంచి దాదాపు అరగంట ప్రయాణ దూరంలో ఉన్న ఓ కాలేజీ ఁసి*తో ప్రారంభమయ్యే పేరుతో ఉందని, దాని సమీపంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం సెంటర్ నుంచే తన కార్డును వినియోగించి డబ్బు డ్రా చేశారని వివరించింది. మరోపక్క లైంగికదాడికి గురైన సమయంలో బాధితురాలు ధరించిన దుస్తుల్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో సిటీకి...
నిందితులపై వెర్సోవా పోలీసులు పటిష్ట సెక్షన్ల కిందే కేసు నమోదు చేశారు. ఐపీసీతో పాటు నిర్భయ చట్టాన్నీ చేర్చారు. ఇందులో 120-బి (కుట్ర), 328 (నేరం చేసే ఉద్దేశంతో మత్తు మందు/విషం ఇవ్వడం), 376-ఇ (మహిళపై ఒకటి కంటే ఎక్కువసార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడటం), 379 (తస్కరణ), 420 (మోసం) సెక్షన్ల కింద ఆరోపణలు మోపారు. బాధితురాలి సెల్‌ఫోన్, బంగారు ఆభరణాలు, నగదుతో సహా మొత్తం రూ.1.2 లక్షల విలువైన సొత్తును నిందితులు దోచుకున్నట్లు గుర్తించారు.
ఆమె చెప్పిన వివరాల ప్రకారం హ్యాపీ, అలీ, మంజూర్ తదితరుల్ని ప్రాథమికంగా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరోపక్క ఈ ఘటనతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్‌జీఐఏ పోలీసులు వెర్సోవా అధికారుల్ని గురువారం సంప్రదించారు. ఘటన శంషాబాద్ విమానాశ్రయం నుంచి గంటన్నర ప్రయాణం చేసిన తరవాత వచ్చే ప్రాంతంలో జరిగినట్లు అక్కడి పోలీసులు వీరికి తెలిపారు. పటాన్‌చెరు సమీపంలో లైంగికదాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. జనరల్ డైరీలో ఎంట్రీ, కేసు నమోదు, ప్రాథమిక విచారణ, ఆధారాల సేకరణ తదితర ప్రక్రియల్ని పూర్తి చేసిన వెర్సోవా పోలీసులు దర్యాప్తు, కేసు ఫైల్ అందించేందుకు బాధితురాలిని తీసుకుని ఓ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు గురువారం పయనమయ్యారు.