భూసేకరణ చట్టానికి తిలోదకం
- భూయజమానులతో చర్చలద్వారా భూముల కొనుగోలు
- బేసిక్ వేల్యూపై రెండున్నర రెట్ల ధర నిర్ధారణ
- అసైన్డ్ భూములకూ ఇదే విధానం అమలు
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు భారీఎత్తున భూపందేరం చేసేందుకు సిద్ధమైన రాష్ట్రప్రభుత్వం ఇందుకోసం పెద్దమొత్తంలో భూముల్ని సేకరించడంపై దృష్టిపెట్టింది. ఈ సేకరణలో కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించాలని నిర్ణయించింది.కేంద్రప్రభుత్వం చేసిన 2013 నాటి భూసేకరణ చట్టం కింద అధిక పరిహారం చెల్లించాల్సి రావడంతోపాటు అందులోని నిబంధనల వల్ల భూ సేకరణ అంత సులువు కాదు. ఈ ఇబ్బందుల్లేకుండా పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల్ని సులభంగా అప్పగించేందుకు వీలుగా ఆ చట్టానికి రాష్ట్రప్రభుత్వం తిలోదకాలిచ్చింది. కొత్త విధానం అమలుకు నిర్ణయించింది. భూసేకరణకు స్వస్తిచెప్పి భూయజమానులతో చర్చలద్వారా భూముల్ని కొనుగోలు చేయాలని నిశ్చయించింది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ కొత్త విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది.
కేంద్ర చట్టం ప్రకారమైతే..
2013 భూసేకరణ ద్వారా భూమి సేకరించాలంటే తొలుత సామాజిక ప్రభావం(సోషల్ ఇంపాక్ట్) అధ్యయనం చేయాలి. ఆ నివేదికను నిపుణుల కమిటీ ఆమోదానికి పంపాలి. అది ఆ భూముల సేకరణ వల్ల పర్యావరణానికి లేదా ఆహారధాన్యాల ఉత్పత్తికి హాని కలుగుతుందని భావించి.. తిరస్కరిస్తే ఆ భూముల్ని సేకరించడానికి వీలుండదు.
ఇక చర్చలద్వారానే కొనుగోలు..
దీంతో భూ యజమానులతో చర్చలద్వారా భూముల్ని కొనుగోలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు అవసరమైన భూముల్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) రైతులనుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయనుంది. ఆ ప్రకారం పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూమి ఎంత కావాలో.. ఎక్కడ కావాలో జిల్లా కలెక్టర్లకు ఏపీఐఐసీ తెలియజేస్తుంది. ఆ జిల్లా కలెక్టర్ ధర నిర్ధారణకు ఆర్డీవో/సబ్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ఆ భూమి కనీస విలువ(బేసిక్ వేల్యూ)పై రెండున్నర రెట్లు ధరను నిర్ధారిస్తుంది. ప్రాథమికంగా భూ యజమానులు ఎవరనేది విచారణ చేపడుతుంది. తరువాత జాయింట్ కలెక్టర్ ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తారు.
ఆ భూమి కొనుగోలుపై చర్చలకు రావాలంటూ సదరు భూమి యజమానులకు నోటీసు జారీచేస్తారు. పత్రికల్లోనూ ప్రచురిస్తారు. తదుపరి భూమి కొనుగోలు కమిటీ భూయజమానులతో సంప్రదింపులు జరిపి కొనుగోలు చేస్తుంది. ఇందుకు సంబంధించి కొనుగోలు కమిటీ, భూయజమాని మధ్య ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందానికి, పరిహారం చెల్లింపునకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలుపుతారు. ఆ భూమిని కొనుగోలు చేసినట్లు పత్రికల్లో ప్రచురించడంతోపాటు అభ్యంతరాలుంటే తెలపాలని కోరతారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఆర్డీవో వాటిని పరిష్కరిస్తారు. ఆ భూమిని తహసీల్దారు ఏపీఐఐసీకి రిజస్ట్రేషన్ చేయడంతోపాటు ఫిజికల్‌గా పొజిషన్ ఇస్తారు. సబ్ కలెక్టర్, ఆర్డీవో.. భూయజమాని బ్యాంకు అకౌంట్‌కు పరిహారాన్ని జమ చేస్తారు.
అసైన్డ్ భూములకూ ఇదే విధానం..
అసైన్డ్ భూములుంటే ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుంటుంది. ఒకవేళ అసైన్డ్ భూముల్ని సేకరించాల్సి ఉంటే చర్చలద్వారానే వాటినీ కొనుగోలు చేయనున్నారు.
95 వేల ఎకరాలకుపైగా అవసరమన్న ఏపీఐఐసీ
ఇదిలా ఉండగా ప్రాధాన్యతలో భాగంగా ప్రస్తుతం అసైన్డ్, పట్టా, ప్రభుత్వ భూములు కలపి మొత్తం 95,622.75 ఎకరాలు అవసరమని ఏపీఐఐసీ నివేదిక సమర్పించింది. ఈ భూముల్ని ప్రభుత్వం ఏపీఐఐసీకి ఇవ్వాల్సి ఉంది. జిల్లాలవారీగా కావాల్సిన భూముల వివరాలను కూడా రాష్ట్రప్రభుత్వానికి అందజేసింది. ఇందులో పట్టా భూములు 22,411.09 ఎకరాలు, 37,190.61 ఎకరాలు అసైన్డ్ భూములు, 36,021.05 సర్కారు భూములున్నాయని నివేదికలో స్పష్టం చేసింది. ఈ భూముల్ని ప్రైవేటు సంస్థలకు కేటాయించడం జరుగుతుంది.