క్రమబద్ధీకరణకూ బయోమెట్రిక్
♦ అధికారుల వేలిముద్రతోనే సవరణలు, రిజిస్ట్రేషన్లకు ఆమోదం
♦ రేపట్నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జీవో 59 రిజిస్ట్రేషన్లు
♦ నెలాఖరుకల్లా అన్ని జిల్లాల్లోనూ చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ
♦ అవకతవక లు జరిగితే తహసీల్దార్లు, ఆర్డీవోలదే బాధ్యత సీసీఎల్‌ఏ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ తుది అంకానికి చేరింది. జీవో 59 కింద దరఖాస్తుదారులు కోరిన భూములను వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమైన కన్వేయన్స్ డీడ్‌ను రెవెన్యూశాఖ ఇప్పటికే ఆమోదించింది. అయితే, క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరగకుండా నియంత్రించేందుకు భూపరిపాలన విభాగం (సీసీఎల్‌ఏ) సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. మొత్తం ప్రక్రియలో ఆయా మండలాల తహసీల్దార్లను, రెవెన్యూ డివిజన్ల అధికారు(ఆర్డీవో)లను జవాబుదారీ చేసే ఉద్దేశంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
నిబంధనల ప్రకారం అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన సొమ్ము పూర్తిగా చెల్లించినట్లయితే.. ఆయా భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం కన్వేయన్స్ డీడ్ జారీచేయాల్సి ఉంటుంది. అయితే, సదరు మండల తహసీల్దారు తన డిజిటల్ సిగ్నేచర్‌తోపాటు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రనూ ఇస్తేనే ఆ డీడ్ జారీ అవుతుంది. అప్పుడే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారు. తొలివిడతలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని మండల రెవెన్యూ, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలకు బయోమెట్రిక్ యంత్రాలను సీసీఎల్‌ఏ అధికారులు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన కన్వేయన్స్ డీడ్ నమూనాను ఆన్‌లైన్‌లో పెట్టినందున, మంగళవారం నుంచి క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని తహసీల్దార్లు, ఆర్డీవోలకు సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలందాయి. నెలాఖరుకల్లా అన్ని జిల్లాల్లోనూ చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ చేపట్టనున్నారు.
వీడని సాంకేతిక సమస్యలు
ఉన్నతాధికారుల స్థాయిలో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ విధానాన్ని అప్‌డేట్ చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. జీవో 59 (చెల్లింపు కేటగిరీ) కింద దరఖాస్తు చేసుకుంటే జీవో 58 నిబంధనలను సాఫ్ట్‌వేర్ వర్తింపజేస్తోంది. ఎలాగంటే, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల డివిజన్‌లోని ఒక మండలంలో జీవో 59 కింద 160 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించాలని ఒక వ్యక్తి దరఖాస్తు చేశాడు. సదరు స్థలాన్ని పరిశీలించిన అధికారులు విస్తీర్ణం 149 గజాలే ఉందని తేల్చారు. 149 గజాలకు ప్రభుత్వం నిర్దేశించిన సొమ్ము చెల్లించాలంటూ అధికారులు నోటీసులు సిద్ధం చేయగా, కేవలం 30 గజాలకు మాత్రమే సొమ్ము చెల్లించాలని అందులో ముద్రితమైంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సాంకేతిక ఇబ్బందులతో క్షేత్రస్థాయి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. సదరు నోటీసుల్లోని తప్పులను సరిదిద్దేందుకూ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని తహసీల్దార్లు కోరుతున్నారు.
వేలిముద్ర వేస్తేనే ఆమోదం
చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులో పేర్కొన్న వివరాలకు, పరిశీలనలో వెల్లడైన వివరాలకు పొంతన లేకపోవడంతో పలు అంశాలను సవరించాల్సిన అవసరమేర్పడింది. దరఖాస్తుదారు పేరు, చిరునామా, భూమి విస్తీర్ణం, హద్దులు, చెల్లించిన నగదు.. ఇలా పలు వివరాలను సరిదిద్దేందుకు ఒకట్రెండుమార్లు ఉన్నతాధికారులు అవకాశమిచ్చినా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సవరణ ప్రక్రియ పూర్తిగా జరగలేదు. ఎక్కువసార్లు సవరణకు అవకాశమిస్తే అవకతవకలు జరుగుతాయని భావించిన సీసీఎల్‌ఏ.. కొద్దిరోజులుగా వెబ్‌సైట్‌ను కూడా నిలుపుదల చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అధికారుల నుంచి విజ్ఞాపనలు వెల్లువెత్తడంతో తాజాగా సవరణలకు అవకాశ మివ్వాలని నిర్ణయించింది. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేస్తేనే సదరు సవరణలకు ఆమోదం పొందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.