మరోసారి గడువు పొడిగింపుపై సందిగ్ధత
భూముల క్రమబద్ధీకరణకు ముగిసిన గడువు
సాక్షి, హైదరాబాద్ : భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సోమవారంతో గడువు ముగిసినందున మరోసారి గడువును పొడిగిస్తారా..? లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు (జీవో 59) జారీచేసి 14 నెలలైనప్పటికీ ఒక్క లబ్ధిదారుడికి కూడా నేటివరకు భూమి రిజిస్ట్రేషన్ జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా అందిన సుమారు 49 వేల దరఖాస్తుల్లో 18 వేల దరఖాస్తులు అర్హమైనవిగా క్రమబద్ధీకరణ కమిటీలు సిఫారసు చేయగా, మిగిలిన 31వేల దరఖాస్తులను పరిష్కరించేందుకు పలు అంశాలపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టత(క్లారిఫికేషన్) కోరాయి.
గడువులోగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవకాశం ఇవ్వకపోగా, కోరిన స్పష్టత ఇవ్వడంలోనూ భూపరిపాలన విభాగం వైఫల్యం కనిపిస్తోంది. ఒకేసారి మొత్తం సొమ్ము చెల్లించిన వారి సంగతి అలా ఉంచితే.. వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లిస్తున్న వారి నుంచి ఇకపై సొమ్ము స్వీకరించాలా, వద్దా అని క్షేత్రస్థాయి అధికారుల నుంచి సందేహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. వివిధ జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎక్కువశాతం మంది ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొన్న కారణంగా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలేకపోయామని, ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని, భూపరిపాలన ప్రధాన కమిషనర్ సోమవారం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్‌మీనాను సాక్షి వివరణ కోరగా... ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించామని, ఇకపై పొడిగించే అవకాశం లేనట్లేనని అన్నారు. ఒకవేళ గడువును పొడిగించాల్సిన పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.