సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ మంచినీటిని అందించే మిషన్ భగీరథ ప్రాజెక్టు తొలి ఫలాలను ఈ నెలాఖరులోగా అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. గురువారం మిషన్ భగీరథ, ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులపై ఆర్‌డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఫ్లోరైడ్ పీడిత మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు వచ్చే వేసవికల్లా తాగునీరు అందిస్తామని చెప్పారు.
నిర్దేశిత లక్ష్యాల మేరకు ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయని... అయినా మరింత వేగంగా పనులను జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా ఇంటేక్ వెల్స్‌ను భద్రమైన స్థితికి తేవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి తెలుసుకునేందుకు నీతి ఆయోగ్ బృందం ఈనెల 12న రాష్ట్రానికి రానుందని కేటీఆర్ తెలిపారు.
ఆర్నెల్లలో ఇంటింటికీ ఇంటర్నెట్!
నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఆర్నెల్లలోగా ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ మొదటి దశలో నీరిచ్చే నియోజకవర్గాల్లో తాత్కాలికంగా ఫైబర్‌గ్రిడ్ పనులను చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఫైబర్ గ్రిడ్ పనుల ప్రారంభానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథలో భాగంగా త్వరలోనే నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని గ్రామాలకు రెండో దశలో నీటి సరఫరాతో పాటు బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తామని తెలిపారు.
నెలాఖరుకల్లా మిషన్ భగీరథ ఫలాలు
Published Fri, Apr 8 2016 4:04 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement