సాక్షి, హైదరాబాద్: భారతీయ సమాజంలో ప్రతి పర్వదినానికి ఓ విశిష్టత ఉందని... వేదాలు, పురాణాలు పూర్వీకుల నుంచి సాంప్రదాయకంగా వస్తున్న ప్రతి పండుగలో శాస్త్రీయత, చరిత్ర ఇమిడి ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. విళంబి నామ సంవత్సర ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడారు.
ఉగాది పండుగ ప్రకృతితో ముడిపడి ఉందని, ఆ విషయం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే తరాలకు సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు పండుగల ప్రత్యేకతను వివరించి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కులమతాలకతీతంగా అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా అందరూ బాగుపడాలన్న లక్ష్యంతో మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ నూతన సంవత్సరం సందర్భంగా నరేంద్రమోదీ ఆశయాలు, సంకల్పాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీ శశిభూషణ్ శర్మ పంచాంగ శ్రవణం చేయగా, కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్ రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment