- లక్ష్మణరావు ‘బాబా’కథను నమ్మిన ఐటీ విభాగం
- కేసు నమోదు చేయాలంటూ సీసీఎస్‌కు లేఖ
- అలా కుదరదని చెప్పిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంలో (ఐడీఎస్) రూ.10 వేల కోట్లు నల్లధనం తన వద్ద ఉన్నట్లు డిక్లేర్ చేసి, పన్ను చెల్లింపు దగ్గరకు వచ్చేసరికి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారుల్ని ముప్పుతిప్పలు పెట్టిన బాణాపురం లక్ష్మణరావు వెనుక ఉన్న ‘బడాబాబులు’ వెలుగులోకి రాన ట్లేనా..? ఔననే అనుమానాలు కలుగుతున్నాయి. సాక్షాత్తు ఐటీ అధికారులే ఇతడు ‘మోసపోయినట్లు’ నిర్ధారించడమే దీనికి కారణం. సోదాల సమయంలో ఆధారాలు సేకరించలేకపోయిన ఐటీ అధికారులు లక్ష్మణరావు ‘బాబా’ కథను నమ్మారు. ఆర్థిక చట్ట ప్రకారం బోగస్ డిక్లరేషన్ చేసిన వారిపై కేసు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉన్నా... అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రైస్ పుల్లింగ్ సహా ఇతర పేర్లతో అతన్ని మోసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీసీఎస్ పోలీసులకు లేఖ రాశారు.
ఈ లేఖను చూసి అవాక్కైన పోలీస్ అధికారులు బాధితుడు కాకుండా మూడో వ్యక్తి/సంస్థ రాసిన లేఖను ఫిర్యాదుగా స్వీకరించలేమని ఐటీ అధికారులకు స్పష్టం చేశారు. బాధితుడే వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రాథమిక ఆధారాలు సమర్పిస్తేనే తదుపరి చర్యలు తీసుకోగలమని ఐటీ అధికారులకు చెప్పారు. దీంతో చేసేది లేక ఐటీ అధికారులు తిరిగి వెళ్లినట్లు సమాచారం. ఐటీ అధికారుల నుంచి తమకు లేఖ అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేయలేమని సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు.
అంచనాలు తారుమారు...
కొందరు ‘బడాబాబులకు’ లక్ష్మణరావు బినామీ అని, వారి నల్లధనాన్నే మార్చేందుకు తనకు చెందినదిగా డిక్లేర్ చేశారని వినిపించింది. అరుుతే నవంబర్ 8న డీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సదరు ‘బడాబాబుల’ అంచనాలు తారుమారైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పన్ను కట్టలేక లక్ష్మణరావును చేతులెత్తేయమని చెప్పారని తెలిసింది. లక్ష్మణరావుకు సంబంధించి వినిపిస్తున్న కథనాలు, అతడి గత చరిత్రను పరిగణనలోకి తీసుకోని ఐటీ అధికారులు అతనిపై సానుభూతి చూపడం ప్రారంభించారు. లక్ష్మణరావు కథలో ఐటీ విభాగం నుంచి ఈ ట్విస్ట్ రావడానికి ‘బడాబాబులు’ తీసుకువచ్చిన ఒత్తిడే కారణమని తెలుస్తోంది.
‘బడాబాబులు’ భద్రమే?
Published Sat, Dec 10 2016 4:05 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement