
డ్రైవర్ సలీం హత్య కేసులో నిందితులకు యావజ్జీవం
ఓ డ్రైవర్ హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
కింది కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఓ డ్రైవర్ హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఖమ్మం జిల్లాకు చెందిన సలీం లారీ డ్రైవర్. శ్రీనివాసరావు క్లీనర్. లారీలో లోడ్ చేసిన కలప విషయంలో వివాదం తలెత్తడంతో శ్రీనివాసరావు డ్రైవర్ సలీంను హత్య చేశాడు. ఇందుకు వెంకటరెడ్డి, యాకూబ్‌రెడ్డిలు సాయం చేశారు. దీనిపై సలీం భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణ జరిపిన ఖమ్మం, మొదటి అదనపు సెషన్స్ జడ్జి 2010లో తీర్పునిస్తూ సలీం హత్య కేసులో శ్రీనివాసరావు, యాకూబ్‌రెడ్డి, వెంకటరెడ్డిలను దోషులుగా నిర్ధారించారు. నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ శ్రీనివాసరావు తదితరులు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషం లేదని తేలుస్తూ అందులో జోక్యానికి నిరాకరించింది. కింది కోర్టు తీర్పును ఖరారు చేస్తూ శ్రీనివాసరావు తదితరులు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది.