మరో 15 వేల మందికి రుణమాఫీ
మరో 15 వేల మందికి రుణమాఫీ
Published Tue, May 30 2017 2:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- రూ. 140 కోట్ల మంజూరుకు వ్యవసాయశాఖ ప్రతిపాదన
- ‘కాగ్’ కడిగేయడంతో ముందుకు కదిలిన యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రుణమాఫీకి అర్హతలుండీ అధికారుల తప్పిదంతో ఇప్పటివరకు మాఫీ సొమ్ముకు నోచుకోని రైతులను ఆదుకోవాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల మందికిపైగా తాజాగా అర్హులు తేలినట్లు సమాచారం. వారికి రూ. 140 కోట్ల మేరకు నిధులు అవసరమని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి విన్నవించింది. దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందోనని అధికారులు ఎదురు చూస్తున్నారు. చివరి విడత రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం ఇటీవలే బ్యాంకులకు విడుదల చేసింది. దీంతో రుణమాఫీ ప్రక్రియ అయిపోయినట్లే. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఆ సొమ్మును విడుదల చేయకపోతే ఇక ఎన్నటికీ న్యాయం జరగదని అధికారులు అంటున్నారు.
వ్యవసాయ, బ్యాంకు అధికారుల తప్పిదం
ప్రభుత్వం రూ. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించి మూడేళ్లుగా ఆ సొమ్మును విడతల వారీగా ఇస్తూ వస్తోంది. చివరి విడత సొమ్మును కూడా ఇటీవలే విడుదల చేసింది. రూ. లక్ష లోపు రుణాలున్న రైతులను పథకం ప్రారంభంలో బ్యాంకు, వ్యవసాయ అధికారులు గుర్తించారు.వారి పేర్లతో జాబితా తయారు చేశారు. అయితే అర్హులైన దాదాపు 15 వేల మందికి పైగా రైతుల పేర్లను సాంకేతిక కారణాలు చూపించి వదిలేశారు. అలా ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే దాదాపు 615 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. అలా అన్ని జిల్లాల్లోనూ ఇదే స్థితి ఏర్పడింది.
లొసుగులు బయటపెట్టిన కాగ్
రుణమాఫీకి అర్హులను వదిలేశారంటూ అధికారుల నిర్లక్ష్యాన్ని ‘కాగ్’కూడా కడిగేసింది. వ్యవసాయ, బ్యాంకు అధికారుల తీరు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పేర్కొంది. మొదటి రెండు విడతల వాయిదాలకు సంబంధించి కాగ్ తనిఖీల్లో అనేక లొసుగులు బయటపడ్డాయి.
Advertisement
Advertisement