హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై లోకాయుక్తా శనివారం విచారణ ముమ్మరం చేసింది. లోకాయుక్తా పరిశోధనాధికారి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విచారణకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ హెల్త్ వైద్యులు హాజరయ్యారు. లోపం ఎక్కడుందన్న దానిపై విచారణ జరిపారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని వైద్యులు స్పష్టం చేస్తూ, తమపై క్రిమినల్ కేసులను నమోదు చేయటాన్ని వైద్యులు బృందం ఖండించింది. కాగా కంటిచూపు మందగించడంతో దానిని మెరుగుపర్చుకోవడం కోసం సరోజినీ ఆస్పత్రిలో గత నెల 30న 21 మంది క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అయితే వారిలో 13 మంది ఇన్‌ఫెక్షన్ బారినపడగా.. ఏడుగురికి కంటిచూపు పోయిన విషయం తెలిసిందే.
అయితే సెలైన్లో బ్యాక్టీరియా ఉండటం వల్లే ఈ ఘటనకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సెలైన్లు చాలా ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేశారని, వాటిన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. సెలైన్ల పంపిణీపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నిపుణులైన వైద్యులే శస్త్రచికిత్సలు చేశారని తెలిపారు. ఇక లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ తాజుద్దీన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నర్సయ్యలతో కూడిన బృందం నిన్న సాయంత్రం సరోజినీ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ బృందం ఇవాళ ఉదయం మరోసారి ఆస్పత్రిలో పర్యటించింది. ఆస్పత్రిలో ప్రతి ఒక్కరి నుంచి విచారణ బృందం వివరాలు సేకరించింది. రోగులతో పాటు డాక్టర్లను, నర్సులను విచారణ చేశారు. ఆపరేషన్ థియేటర్ను క్షుణ్ణంగా పరిశీలించింది.
అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసి కంటి ఆస్పత్రుల రీజనల్ కమిటీ కూడా విచారణ జరిపింది. ఈ ఘటనపై ఆ కమిటీ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా ఐ ఆస్పత్రి రీజనల్ కమిటీ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెలైన్లో ఫంగస్ ఉందన్నారు. అలాగే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ... పూర్తి వ్యవహారంపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌లను ఆదేశించింది.
సరోజినీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
Published Sat, Jul 9 2016 1:56 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement
Advertisement