
ఏపీలో రెండో సీఎంలా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ ఏ అధికారం లేకుండానే రెండో సీఎంగా వ్యవహరిస్తున్నారని దివంగత సీఎం ఎన్టీ రామారావు
- ఏం అధికారం ఉందని మంత్రులపై పెత్తనం చేస్తున్నారు
- వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ ఏ అధికారం లేకుండానే రెండో సీఎంగా వ్యవహరిస్తున్నారని దివంగత సీఎం ఎన్టీ రామారావు సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. లోకేశ్‌కు ఏ అధికారం ఉందని మంత్రులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. శనివారం తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ లోకేశ్ చేస్తున్న పాపాలకు అంతేలేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో లోకేశ్ ప్రవర్తనను ఎట్లా సమర్థించుకుంటారని చంద్రబాబును నిలదీశారు. అలాంటి వ్యక్తిని మేధావిగా ప్రచారం చేసుకోవడాన్ని ఆక్షేపించారు. చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చారని, ఆయన జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, దుర్మార్గాలేనని ఆమె మండిపడ్డారు. నిష్కారణంగా తన భర్త ఎన్టీఆర్‌ని పొట్టన పెట్టుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాపాలకు, అవినీతికి ప్రతిఫలమే లోకేశ్ అని అన్నారు.
వేల కోట్లు వసూలు చేస్తున్న లోకేశ్..
పోలవరం నిర్మాణాన్ని పేరుకి ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి ఇచ్చినా లోకేశ్ స్నేహితులే సబ్ కాంట్రాక్ట్ చేస్తున్నారని.. మంత్రుల దగ్గర కూడా లోకేశే పీఏలను నియమించి.. వేల కోట్లు కమిషన్లు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. పట్టిసీమలో ఖర్చు పెట్టిన రూ. 1,600 కోట్లల్లో రూ. 400 కోట్లు, పుష్కరాల్లో వందల కోట్లు దోపిడీ జరిగిందన్నారు. రాజధాని నిర్మాణానికి అమలులోకి తీసుకురానున్న స్విస్‌చాలెంజ్ విధానం ద్వారా రూ. 1.30 లక్షల కోట్లు దోపిడీ జరగబోతుందన్నారు. 20 ఏళ్ల కిందట తాను రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించానని ఆరోపిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేశారని ఆరోపించారు. ప్రస్తుతం అన్ని విషయాల్లో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న తన కుమారుడిని ఏ విధంగా సమర్థించుకుంటావని చంద్రబాబును నిలదీశారు.