ఎనీ సెంటర్‌..గణేష్‌.. ఓ లెక్కుంది! | lord ganesh Registrations are now online | Sakshi
Sakshi News home page

ఎనీ సెంటర్‌..గణేష్‌.. ఓ లెక్కుంది!

Published Wed, Aug 9 2017 11:31 PM | Last Updated on Fri, Sep 7 2018 2:16 PM

ఎనీ సెంటర్‌..గణేష్‌.. ఓ లెక్కుంది! - Sakshi

ఎనీ సెంటర్‌..గణేష్‌.. ఓ లెక్కుంది!

మండపాల రిజిస్ట్రేషన్‌ ఇక ఆన్‌లైన్‌లోనే..
ప్రతి గణేష్‌ విగ్రహానికి క్యూఆర్‌ కోడ్‌
అనుమతి పత్రాన్ని మండపాల ప్రాంతంలో అతికించాలి
తనిఖీల నిర్వహణపై అధికారుల కన్ను
జవాబుదారీగా ఉంటుందన్న నగర పోలీసులు
అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింక్‌ ఏర్పాటు
విగ్రహ ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు పర్యవేక్షణ


గణేష్‌ ఉత్సవ నిర్వాహకులకో ముఖ్య గమనిక. ఈ ఏడాది మండపాల ఏర్పాటు... నిమజ్జన యాత్రకు సంబంధించిన అనుమతులన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి.  ఇందుకోసం హైదరాబాద్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌లో ఒక ప్రత్యేక లింక్‌ ఏర్పాటు చేశారు.  భద్రత, పర్యవేక్షణ విధులు సులువుగా ఉండేందుకే..గతంలోని మాన్యువల్‌ పద్ధతికి పోలీసులు స్వస్తి పలికారు.

సిటీబ్యూరో: సిటీలో ఏటా జరిగే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన యాత్ర నగర పోలీసులకు అత్యంత కీలకమైన ఘట్టాలు. మండపం ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయడం నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటి వరకు మాన్యువల్‌గా జరుగుతున్న ఈ తతంగాన్ని సిటీ కాప్స్‌ ఆన్‌లైన్‌ చేశారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తున్నారు. దీంతో తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు అంతా మాన్యువల్‌గా...
నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. దీనికోసం నిర్ణీత సమయం ముందు నుంచి పోలీసుస్టేషన్లలో దరఖాస్తులు అందిస్తుంటారు. వీటిని పూర్తి చేసే మండప నిర్వాహకులు సంబంధిత పత్రాలు, నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్లు జత చేసి ఠాణాలోనే దాఖలు చేయాల్సి ఉండేది. వీటి ఆధారంగా పోలీసులు మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రతి దానికీ ఓ నెంబర్‌ కేటాయించే వారు. సదరు విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ఆ నెంబర్‌ ఆధారంగానే పర్యవేక్షణ జరిగేది. ఇప్పటి వరకు ఇదంతా మాన్యువల్‌గా జరుగుతూ వచ్చింది.

వెబ్‌సైట్‌లో లింకు ఏర్పాటు...
ఈ మాన్యువల్‌ విధానం ఇబ్బందులతో కూడుకున్నది కావడంతో మండపాల రిజిస్ట్రేషన్‌ను సిటీ కాప్స్‌ ఆన్‌లైన్‌ చేశారు. నగర పోలీసు అధికారిక వెబ్‌సైట్‌ (ఠీఠీఠీ.జిyఛ్ఛీట్చb్చఛీఞౌ జీఛ్ఛి.జౌఠి.జీn) హోమ్‌పేజ్‌లో ప్రత్యేక లింకు ఏర్పాటు చేశారు. మండపాలు ఏర్పాటు చేయాలని భావించిన వారు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి లింకు క్లిక్‌ చేస్తే చాలు. ప్రతి ఏటా ఏర్పాటు అవుతున్న మండపం, కొత్తగా ఏర్పాటవుతున్న వాటికి వేర్వేరు విభాగాలు కేటాయించారు. కొత్త మండపానికి సంబంధించి పూర్తి వివరాలు నింపాల్సి ఉండగా... పాత మండపం నిర్వాహకుల డేటా సైట్‌లో అందుబాటులోనే ఉంటుంది. వీరు కేవలం మార్పు చేర్పుల్ని చేరుస్తూ ఆన్‌లైన్‌లోనే దాఖలు చేసి దాని ప్రింట్‌ఔట్‌తో పాటు పత్రాలను ఠాణాలో సమర్పించాలి.

ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ కేటాయింపు...
ఇలా ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించడానికి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక వింగ్‌ ఏర్పాటు చేశారు. వీరు ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి లేఖ ఇస్తారు. దీనిపై ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ముద్రిస్తారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్‌ కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో అనుమతి మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా పని సాఫీగా సాగుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ అనుమతి పత్రాన్ని మండప నిర్వాహకులు తమ మండపాల్లో నిర్ణీత ప్రాంతంలో అతికించాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌ కాప్‌లోకి లింకు...
ఈ క్యూఆర్‌ కోడ్స్‌ డేటాను నగర పోలీసు యాప్‌ హైదరాబాద్‌ కాప్‌లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది. క్యూఆర్‌ కోడ్‌ కేటాయింపులోనే అధికారులు పక్కాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వారీగా వేర్వేరుగా దీని కేటాయింపు జరుగుతోంది.

కోడ్‌ స్కానింగ్‌తో తనిఖీలు
ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు అయినప్పటి నుంచి అందులోని విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్‌ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్ళి పరిస్థితుల్ని అంచనా వేయడంతో పాటు తనిఖీలు చేపడుతుండాలి. ఇప్పటి వరకు ఈ విధానం సైతం మాన్యువల్‌గానే సాగుతోంది. అయితే తాజాగా క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తున్న నేపథ్యంలో గస్తీ సిబ్బంది తనిఖీలప్పుడు తమ ట్యాబ్స్‌ను వినియోగిస్తారు. ఆయా మండపాల వద్దకు వెళ్ళి కోడ్‌ను హైదరాబాద్‌ కాప్‌ యాప్‌లో స్కాన్‌ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్‌ ద్వారానే తెలుస్తుంది.

నిమజ్జనం సమయంలో స్పష్టత...
గణేష్‌ ఉత్సవాల్లో నిమజ్జనం అత్యంత కీలకమైన ఘట్టం. నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్‌ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్‌ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు అందరు సిబ్బంది, అధికారులకు యాప్‌ ద్వారా తెలుస్తుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement