
ప్రయాణికులపై విరిగిన లాఠీ
► సికింద్రాబాద్ స్టేషన్‌లో తోపులాట..
► పోలీసుల లాఠీచార్జీ.. పలువురికి గాయాలు
► భోగి రోజూ కిటకిటలాడిన బస్సులు, రైళ్లు
► సొంత ఊళ్లకు తరలివెళ్లిన 5 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారితో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇవికాక ప్రైవేటు వాహనాల్లోనూ పయనమవడంతో రోడ్లూ కిక్కిరిసి పోయాయి. భోగి రోజు కూడా సిటిజనులు భారీగా పయనమయ్యారు. వివిధ మార్గాల్లో శుక్రవారం ఒక్క రోజే దాదాపు ఐదు లక్షల మంది హైదరాబాదీలు తమ ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కాలు పెట్టలేని పరిస్థితి. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీల్లో ఎక్కేందుకు ప్రయాణికులు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ప్రయాణికులను నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీలు ఝులిపించారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఒక మహిళ తలకు తీవ్ర గాయం అయింది.
250 అదనపు బస్సులు...
వారం క్రితం ప్రారంభమైన సంక్రాంతి రద్దీ శుక్రవారం కూడా కొనసాగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్‌లు, నగరానికి నాలుగు వైపులా ప్రధాన కూడళ్లు... ఎక్కడ చూసినా సొంతూళ్లకు పయనమయ్యే ప్రయాణికులే కనిపించారు. 3,500 రెగ్యులర్‌తో పాటు, మరో 250 బస్సులను ఆర్టీసీ అదనంగా నడిపింది. వీటికితోడు 80కి పైగా ఎక్స్‌ప్రెస్‌లు, మరో 1000 ప్యాసింజర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. మరోవైపు ప్రైవేటు బస్సులు, వాహనాలు రోడ్లపై పోటెత్తాయి. అంతా కలిపి దాదాపు ఐదు లక్షల మంది నగరవాసులు సంక్రాంతిని సొంతూళ్లలో జరుపుకొనేందుకు పయనమయ్యారు.
అతిగా ప్రవర్తించిన పోలీసులు...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులను అదుపు చేసే క్రమంలో పోలీసులు అతిగా ప్రవర్తించినట్లు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ మీద ఆగీఆగక ముందే ఎక్కేందుకు.. ప్రయాణికులు ఒక్కసారిగా తోసుకుని ముందుకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రయాణికులపై లాఠీలతో తమ ప్రతాపాన్ని చూపారు. శ్రీకాకుళానికి చెందిన మహిళ పల్లవి తలపై లాఠీతో కొట్టారు. తీవ్ర గాయమైన ఆమెకు పోలీసులు వెంటనే ప్రథమ చికిత్స చేయించి పంపించారు. పోలీసుల తీరుపై ప్రయాణికులు నిరసన తెలిపారు. సరైన సదుపాయాలు కల్పించలేని రైల్వే అధికారులు... లాఠీలతో కొట్టించడం దారుణమన్నారు. అదుపు చేసే క్రమంలోనే లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చిందని సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.
బోసిపోయిన స్టేషన్...
నిత్యం తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణికుల సందడి కనిపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఒక్కసారిగా బోసిబోయింది. సంక్రాంతికి ఊళ్లకెళ్లేవారితో మూడు రోజులుగా ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉన్న స్టేషన్... శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఆ సందడి కనిపించక ప్లాట్‌ఫామ్‌లు వెలవెలబోయాయి.