
ఎలాగైనా గమ్యం చేరాలి... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సర్కస్ ఫీట్
*పల్లెకు పోదాం చలో..చలో..
సంక్రాంతి సమీపిస్తోంది. నగరం నుంచి సొంతూళ్లుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు..ఎటు చూసినా కిటకిటే. సీట్లు దొరక్క, బెర్తులు లభించక ప్రయాణికులకు నానాపాట్లు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం బారులుతీరి కన్పించిన దృశ్యం...
నగరం పల్లెబాట పట్టింది. మూటాముల్లె సర్దుకుని.. సొంతవారి వద్దకు సాగిపోతోంది. ఉపాధి కోసం ఆశల ‘కాంతి’ని కళ్లల్లో నింపుకుని ఎగిరొచ్చినవారు.. తనవారితో ‘సంక్రాంతి’ ఆనందాలను పంచుకునేందుకు తరలిపోతున్నారు. రైల్లో రిజర్వేషన్ లేనిదే ప్రయాణించనివారు.. పక్కవారి చేయి తగిలితే కసురుకునేవారు ఇప్పుడు ఒకరిపై మరొకరు పడుతున్నా ‘సర్దుకుపోదాం’ అంటున్నారు. బక్కపలచనివారు కూడా బండి ఆగీ ఆగగానే చోటు కోసం ‘బల ప్రదర్శన’కు దిగుతున్నారు. చోటుదొరకినవారు ఉస్సూరు మంటూ మరో బండి కోసం క్యూ కడుతున్నారు. మరికొందరు ‘మరో మార్గం’ దొరక్కపోతుందా.. అన్నట్టు వెనుదిరుగుతున్నారు. సోమవారం సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్‌లో ఇదే పరిస్థితి కనిపించింది.
సీట్లు లేవు..బెర్తులు దొరకవు
కిక్కిరిసిన బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు సిటీ ఒక్కరోజే 1700కు పైగా ప్రత్యేక బస్సులు కాకినాడకు జనసాధారణ్ రైళ్లు కొనసాగిన ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీ
సిటీబ్యూరో: సిటీ నుంచి సోమవారం ఒక్కరోజే 1700 పైగా అదనపు బస్సులు.. ప్రత్యేక రైళ్లు నడిచాయి.. సంక్రాంతికి సొంతూరికి వెళ్లే ప్రయాణికులతో అన్నీ కిటకిటలాడాయి. బస్సుల్లో సీట్లు..రైళ్లలో బెర్తులు లభించక అవస్థలు పడ్డారు. మంగళ, బుధవారాల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. నగరం నుంచే కాకుండా శివారు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూరి బాట పట్టారు. ఆర్టీసీ ప్రతి రోజు 3500 బస్సులను నడుపుతుం ది. రద్దీని దృష్టిలో ఉంచుకుని సోమవారం రాత్రి 11 గంట ల వరకు అదనంగా 1500 బస్సులను ఏర్పాటుచేసింది.
విజయవాడ,గుంటూరు, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి,విశాఖ, నెల్లూరు, కర్నూలు,నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు వెళ్లా యి. ప్రైవేటు బస్సులు కూడా సాధారణం కంటే రెండొందలకు పైగా అదనపు బస్సులు నడిచాయి. అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు,కాచిగూడ,ఆబిడ్స్,కోఠీ, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల నుంచే కాకుండా మెహదీపట్నం, కుత్బుల్లాపూర్, బాలానగర్, జూబ్లీబస్‌స్టేషన్, ఉప్పల్, హయత్‌నగర్, తదితర నగర శివారు ప్రాంతాల నుంచి ప్రైవేట్ వాహనాలు బయలుదేరాయి.
నేడు మరింత పెరగనున్న రద్దీ...
సంక్రాంతి రద్దీ మంగళవారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగానే ఆర్టీసీ 2000 బస్సులను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరి వెళ్తాయి. ఎప్పటిలాగే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వైపు వెళ్లే బస్సులను జూబ్లీబస్‌సే ్టషన్ నుంచి, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులు సీబీఎస్ హేంగర్ నుంచి బయలుదేరుతాయి.
నల్లగొండ, మిరియాలగూడ వైపు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్ నుంచి, వరంగల్, హన్మకొండ, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్‌రోడ్స్ నుంచి బయలుదేరుతాయి. సూర్యాపేట్, కోదా డ, దేవరకొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, విజయవాడ, గుంటూ రు, బెంగళూరు, షిరిడీ, ముంబయి, చెన్నై, తదితర రూట్లకు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ నుంచి వెళ్తాయి.
తొమ్మిది లక్షల మంది..
అఫ్జల్‌గంజ్: ఎంజీబీఎస్‌లో సోమవారం సాయంత్ర ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపేందుకు అధికారులు హైరానా పడ్డారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈనెల 8వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి 8గంటల వరకు సుమారు 9 లక్షల మంది ప్రయాణికులను నగరం నుండి వివిధ ప్రాంతాలకు చేరవేసినట్లు రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ తెలిపారు. ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం 14 సహాయక కేంద్రాలను, ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.
అధిక చార్జీలతో ఆవిరి...
ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలతో పాటు, ప్రైవేట్ ఆపరేటర్లు, ట్రావెల్స్, ఇతర ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను దోచేశాయి. సంక్రాంతి సంబరాల కోసం సొంత ఊరుకు వెళ్తున్న ప్రయాణికుల సంతోషం అదనపు చార్జీలతో ఆవిరైపోయింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.450 తీసుకునేవారు సంక్రాంతి హడావుడి ప్రారంభమైన నాలుగు రోజులు నుంచే రూ.900 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు.
కాకినాడకు ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ద.మ.రైల్వే సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ-కాకినాడ (07425) మంగళవారం రాత్రి 10.45కు బయలుదేరి బుధ వారం ఉదయం 9.45 కు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ-కాచిగూడ (07426) బుధవారం సాయంత్రం 6.30కు బయలుదేరి గురువారం ఉదయం 5.25కు కాచిగూడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడ (07205) ఈనెల 13,15,17 తేదీల్లో రాత్రి 10.40కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45కు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడ-సికింద్రాబాద్ (07206) ఈనెల 14,16,18 తేదీల్లో సాయంత్రం 4.45కు కాకినాడలో బయలుదేరుతుంది.