ఈ–టాయ్‌లెట్లు వస్తున్నాయ్ !
తక్కువ నీటి వినియోగం
ఆటో క్లినింగ్ సదుపాయం
సిటీబ్యూరో: అతి తక్కువ నీటి వినియోగంతో ఆటో క్లీనింగ్ సదుపాయాలతో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే దుర్గంధ రహిత ఎలక్ట్రానిక్ టాయ్‌లెట్ల(ఈ–టాయ్‌లెట్ల) ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ఉన్న ఈ టాయ్‌లెట్లను గ్రేటర్‌లో తొలిదశలో 10 – 15 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఎలా పనిచేస్తాయి ఈ–టాయ్‌లెట్లు..
వినియోగానికి ముందు.. తర్వాత ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసే మెకానిజం ఈ టాయ్‌లెట్ల ప్రత్యేకత. ఎనరోబిక్ బయోడిగ్రేషన్ ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాల నిర్వహణ జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా సివర్ లైన్‌కు లేదా సెప్టిక్ ట్యాంక్‌కు కూడా వ్యర్థాలు వెళ్లేలా చేయవచ్చు. నిత్యం మనుషులతో క్లీనింగ్, నిర్వహణ అవసరం లేదు. వినియోగించేందుకు వెళ్లిన వారికి టాయ్‌లెట్ అందుబాటులో ఉన్నదీ, లేక లోపల ఇతరులున్నదీ ఎల్‌ఈడీ ఇండికేషన్స్ ద్వారా తెలుస్తుంది. లోపల ఎవరైనా ఉంటే బయట రెడ్ లైట్, ఎవరూ లేకపోతే గ్రీన్ లైట్ వెలుగుతుంది. టాయ్‌లెట్‌లో 225 లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన ఇన్‌బిల్ట్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్‌లో నీటి పరిమాణం ఎంత ఉందో కూడా తెలుస్తుంది. టాయ్‌లెట్స్‌ను వినియోగించే విధానం అక్షరాల్లో రాసి ఉండటంతో పాటు వాయిస్ గైడెన్స్ సదుపాయానికి కూడా అవకాశం ఉంది.
సీఎస్‌ఆర్ కింద ఏర్పాటు..
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద వీటికయ్యే వ్యయాన్ని భరించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. పురుషుల కోసం ఏర్పాటు చేసే టాయ్‌లెట్లకు ఒక్కోదానికి రూ. 6.35 లక్షలు, మహిళల టాయ్‌లెట్లకు ఒక్కోదానికి రూ. 7.30 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్, వెబ్–మొబైల్ టెక్నాలజీస్‌తో ఇవి పనిచేస్తాయి.
నేడు చార్మినార్ వద్ద షీ–టాయ్‌లెట్ ప్రారంభం
ఈ–టాయ్‌లెట్లను పురుషులవి హీ– టాయ్‌లెట్స్, మహిళలవి షీ–టాయ్‌లెట్స్‌గా పేర్కొంటున్నారు. నగరంలో తొలిసారిగా ప్రముఖ పర్యాటక కేంద్రం చార్మినార్ వద్ద షీ–టాయ్‌లెట్స్‌కు మేయర్ రామ్మోహన్, ప్రజాప్రతినిధులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. షీ టాయ్‌లెట్స్‌లో క్లాత్‌లతో కూడిన వ్యర్థాలను పడవేస్తే అంతర్గతంగా ఆమ్ల రసాయన ప్రక్రియతో అవి పూర్తిగా కాలిపోయే ఏర్పాటు ఉందని అధికారులు పేర్కొన్నారు. వీటిల్లో న్యాప్‌కిన్స్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. త్వరలో ఫలక్‌నుమా ప్యాలెస్, ట్యాంక్‌బండ్, గోల్కొండ కోట, కులీకుతుబ్‌షా టూంబ్స్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ఈ–టాయ్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.