సాహెబ్‌నగర్‌లోని కప్పల చెరువు సర్వేనంబర్ 202లో హుడా అనుమతించిన ప్లాట్లకే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) వర్తిస్తుందని హెచ్‌ఎండీఏ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. ఇటీవల కప్పల చెరువు కట్టను కొంత మంది కబ్జా చేసుకుని ప్లాట్లు చేసిన విషయం వెలుగులోకి రావడంతో అధికారులు పరిశీలించారు. వారం రోజుల్లో కట్టకు హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించి వెళ్లారు.
ఇప్పటికీ హద్దులు నిర్ణయించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన హెచ్‌ఎండీఏ అధికారి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ కట్ట కబ్జాకు గురైందన్న విషయం తేల్చాల్సింది రెవెన్యూ అధికారులేనని తెలిపారు. అప్పట్లో కప్పల చెరువును ఎఫ్‌టీఎల్ నిర్ణయించిన తర్వాతనే 627ప్లాట్లకు హుడా అనుమతులు ఇచ్చారని తెలిపారు.
ఆ ప్లాట్లలోనే ఇళ్లు నిర్మించుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్ స్కీం వస్తుందని, మిగతా ప్లాట్లకు వర్తించదని చెప్పారు. ఆ ప్లాట్ల వారు ఒకవేళ ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు చేస్తే వాటిని తిరష్కరిస్తామని తెలిపారు.