తిరిగి ప్రారంభం కానున్న 'మదీన' హోటల్
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోనే పేరెన్నికగల ‘మదీనా’ హోటల్ మళ్లీ ప్రారంభం కానుంది. అనివార్య కారణాలతో 2009లో మూతపడ్డ ఈ హోటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి హోటల్ నిర్వాహకులు సమాయత్తమవుతున్నారు. నోరూరించే ఇరానీ చాయ్.. కమ్మనైన బిర్యానీ.. రంజాన్ మాసంలో ఘుమఘుమలాడే హలీం తయారు చేయడం ఈ హోటల్ ప్రత్యేకత. మళ్లీ ఇలాంటి రుచులను త్వరలోనే ప్రజలకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్న ఈ హోటల్‌ను రంజాన్ మాసం అనంతరం ప్రారంభించనున్నారు. కాగా ఈ హోటల్ ప్రారంభానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లు హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. మక్కా మదీనా అలావుద్దీన్ వక్ఫ్ ఆధీనంలో ఉన్న ఈ భవనం అద్దె గతంలో సౌదీ అరేబియాలోని మక్కా మదీనాకు వెళుతుండేది. తాజాగా ఎనిమిది నెలలుగా అద్దె తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు వెళుతుంది.
60 ఏళ్ల చరిత్ర మదీనా హోటల్ సొంతం
1944వ సంవత్సరంలో మదీనా హోటల్ భవనానికి హబీబ్ అలావుద్దీన్ అనే యజమాని శంకుస్థాపన చేయడం జరిగింది. కాగా అలావుద్దీన్ హైదరాబాద్ నగరంలో ఐస్, సోడా వ్యాపారాలు నిర్వహిస్తూ ఈ భవనం కట్టాడు. ప్రస్తుతం అలావుద్దీన్ కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 1948లో ఈ భవనం పూర్తయ్యింది. 1956 మార్చి 12న ఇరాన్ దేశానికి చెందిన ‘హసన్ జాబెద్’ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మదీనా హోటల్‌ను చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ ప్రారంభించారు. మొదటి సారి ఈ హోటల్‌లో ఇరానీ ఛాయ్‌ను కేవలం 12 పైసలకు, హలీంను 25 పైసలు, బిర్యానీ 75 పైసలకు విక్రయించారు.
దేశంలోనే తొలిసారిగా హలీం
భారతదేశానికి హలీం రుచి చూపించిన ఘనత మదీనా హోటల్‌కు దక్కుతుంది. ఇరాన్ దేశానికి చెందిన హసన్ జాబెద్ తమ దేశంలో ఎంతో పేరుగాంచిన హలీంను 1956లో రంజాన్ మాసంలో మదీనా హోటల్‌లో ప్రారంభించాడు. కాగా అప్పట్లో హలీంను తయారు చేసిన కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అయిపోయేదని నిర్వాహకులు వెల్లడించారు.