
సాక్షి, హైదరాబాద్: తాను హెలికాప్టర్‌లో వస్తుంటే తెలంగాణలో గ్రీనరీ కనిపించిందని కేంద్ర అటవీ, పర్యావరణ, కల్చరల్ శాఖల మంత్రి డాక్టర్ మహేశ్‌శర్మ అన్నారు. తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని, రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. శనివారం ఆర్‌ఎఫ్‌సీలోని హోటల్‌లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి క్యాలెండర్, స్టిక్కర్స్‌ను, ఈపీటీఆర్‌ఐ వార్షిక నివేదికలను మహేశ్‌శర్మ, రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్నతో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహేశ్‌శర్మ మాట్లాడుతూ, చారిత్రక ఘట్టాలకు తెలంగాణ నిలువుటద్దమనీ, అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక అభిమానం అని చెప్పారు. హరితహారం కార్యక్రమం తెలంగాణ మెడలో మణిహారమని, ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటడం అంటే మామూలు విషయం కాదని ఆయన అన్నారు. టూరిజానికి మంచి భవిష్యత్తు ఉందని, టూరిజం ద్వారా తెలంగాణ భవిష్యత్ మార నుందన్నారు.
మంత్రి జోగు రామన్న మాట్లా డుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లైవ్ స్టాక్ హెరిటేజ్ ఫాం నెలకొల్పాలని జోగు రామన్న కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, పీసీబీ మెంబర్ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ చక్రవర్తి, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా పాల్గొన్నారు.