ఇదీ దాపరికం | 'Make deals with Singapore consortium public' | Sakshi
Sakshi News home page

ఇదీ దాపరికం

Published Sat, Aug 27 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

'Make deals with Singapore consortium public'

ఎకరం బేసిక్ ధర రూ. 4 కోట్లకు అదనం ఎంత?
సింగపూర్ కంపెనీలిచ్చిన సీల్డ్ కవర్‌లోని అంకె ఏమిటి?
అది తెలియకుండా బిడ్డింగ్ ఏమిటి?
ఎవరూ పోటీపడకుండా ఉండడం కోసమేనా ఈ గోప్యత..
సింగపూర్ కంపెనీల పెట్టుబడి రూ.306 కోట్లు
ఉచితంగా ఇస్తున్న 50 ఎకరాల విలువే రూ.300 కోట్లు
అంటే వాటి ఖర్చు రూ.6 కోట్లేనన్నమాట
రైతుల భూముల్లో, సర్కారు సొమ్ముతో ‘రియల్’ వ్యాపారం
ప్లాట్లు పొందే థర్డ్‌పార్టీ కంపెనీలేవో ఎవరికీ తెలియదు..

సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ అంటేనే రహస్యం.. అది ఓ బ్రహ్మపదార్ధం... అంతా గోప్యం... లొసుగుల మయం... తప్పు చేయాలనుకునేవారికి ఇది అయాచిత వరం లాంటిది.

ఈ విధానంలో పారదర్శకత లేదని అత్యున్నత న్యాయస్థానం ఆక్షేపించింది అందుకే... అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్విస్ చాలెంజ్’ విధానానికి ‘పచ్చ’జెండా ఊపింది. సింగపూర్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచింది. రైతుల భూములతో, సర్కారు సొమ్ములతో సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టి ప్రభుత్వపెద్దలు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసి డెరైక్టుగా వేల కోట్లు వెనకేసుకోవడాన్నే చూశాం. ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు. రూ.306 కోట్లు పెట్టుబడిపెట్టే సింగపూర్ కంపెనీలకు వేల కోట్లు దోచిపెట్టడమే కాకుండా... ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసిన వెంచర్‌ను మార్కెటింగ్ చేసేందుకు ఓ కంపెనీని ఏర్పాటు చేయడం..

ఆ కంపెనీలో సింగపూర్ సంస్థకు మాత్రమే పూర్తి స్థాయి అజమాయిషీని కట్టబెట్టడం... రాష్ర్టప్రభుత్వం పాత్రేమీ లేకుండా నామమాత్రంగా విదిలించే వాటాకు పరిమితం కావడం వంటివి చూస్తే మనకు దిమ్మతిరగడం ఖాయం. సింగపూర్ ప్రయివేటు కంపెనీల కన్సార్టియంలో రాష్ర్ట ముఖ్యనేతదే కీలకపాత్ర కావడం వల్లనే ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. భూమి రైతులది... దాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టే ఖర్చు ప్రజలది... లాభాలు మాత్రం సింగపూర్ కంపెనీలవి... రాష్ర్టప్రభుత్వానికి వచ్చే అరకొరవాటా కూడా మార్కెటింగ్ పేరుతో మరో కంపెనీకి కట్టబెట్టడం అన్నిటిలోకెల్లా విచిత్రం... ఈ మార్కెటింగ్ కంపెనీ కూడా కొత్తది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ముఖ్యనేతకు వాటాలున్న సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసేదే ఇది.

‘స్విస్ చాలెంజ్’ విధానం కింద సింగపూర్ ప్రయివేటు కంపెనీల కన్సార్టియం, కేపిటల్‌సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ (ఏడీపీ)గా ఏర్పడిన సంగతి తెల్సిందే. అయితే అభివృద్ధి చేసిన లేఅవుట్లకు పబ్లిసిటీ కల్పించడానికి, వాటిని మార్కెట్ చేయడానికి గాను ఓ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా ఏడీపీ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు గాను ఈ కంపెనీ బ్రోకరేజీ సహా అనేకరకాల ఫీజులు వసూలు చేస్తుంది. ఇవన్నీ పోగా మిగిలిన మొత్తాన్నే సింగపూర్ కంపెనీలు 58శాతం, రాష్ర్టప్రభుత్వం 42శాతం పంచుకుంటాయి. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఇంకా ఇలాంటి అనేక రహస్యాలు దాగి ఉన్నాయి.
 
సీల్డ్ కవర్‌లోని మొత్తం ఎంత?
అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలకు తొలిదశలో ఇస్తున్న 1,691 ఎకరాలలో ఎకరానికి రూ. 4 కోట్లను బేసిక్ ధరగా రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. సింగపూర్ కంపెనీలు ఈ బేసిక్ ధరకు అదనంగా ఎంత ఇస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవి కోట్ చేసిన మొత్తాన్ని సీల్డ్ కవర్‌లో ఉంచారు. ఈ మొత్తం ఎంత అనేది తెలిస్తేనే కదా అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అంతర్జాతీయ కంపెనీలు పోటీపడేది? ఉదాహరణకు సింగపూర్ కంపెనీలు రూ. 4.1 కోట్లను కోట్ చేశాయనుకోండి. అపుడు మిగిలిన కంపెనీలకు ఒక స్పష్టత వస్తుంది. అవి రూ.4.2 కోట్లనో అంతకన్నా ఎక్కువో కోట్ చేయడానికి వీలుంటుంది. కానీ ఇలా రహస్యంగా సీల్డ్ కవర్‌లో ఉంచడానికి సింగపూర్ కంపెనీలను ఎందుకు అనుమతించారో రాష్ర్టప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఈ సీల్డ్ కవర్ వ్యవహారంపైనే ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది.
 
ప్లాట్లు పొందేది ఎవరు?

సింగపూర్ కంపెనీలు ఎకరానికి రూ. 4 కోట్లకన్నా ఎంత అదనంగా కోట్ చేశాయో ఆ మొత్తాన్ని ఇప్పటికిప్పుడు రాష్ర్టప్రభుత్వానికి చెల్లించబోవడం లేదు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ తర్వాత వచ్చే లాభాలలో ఆ మొత్తాన్ని కట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,691 ఎకరాలను అభివృద్ధి చేసి ప్లాట్ల రూపంలో లే అవుట్లు వేస్తుంది. ఈ లే అవుట్లకు మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి రూ. 5,500 కోట్లను కేటాయిస్తుంది. మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత ఆ ప్లాట్లకు మార్కెటింగ్ కంపెనీ దేశ విదేశాల్లో మార్కెటింగ్ నిర్వహిస్తాయి. ఒక విధంగా సింగపూర్ కంపెనీలు బ్రోకర్‌గా వ్యవహరిస్తాయి.

ఆ ప్లాట్లను సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసే మార్కెటింగ్ కంపెనీయే థర్డ్‌పార్టీకి విక్రయిస్తుంది. వాటిని ఎవరికైనా, ఎంతకైనా విక్రయించవచ్చు. ఉదాహరణకి ఎకరం విస్తీర్ణంలో పాట్లను మార్కెటింగ్ కంపెనీ పది కోట్ల రూపాయలకు విక్రయించిందనుకుందాం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఎకరానికి నాలుగు కోట్ల రూపాయల బేసిక్ ధరను చెల్లిస్తాయి. అలాగే తాము అదనంగా ఇస్తామన్న పది లక్షల రూపాయలను కూడా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. మిగతా 5.90 కోట్ల రూపాయల్లో మార్కెటింగ్, ప్రచారం, ఇతర వ్యయాలను కూడా మార్కెటింగ్ కంపెనీ  మినహాయించుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన సొమ్ములో ఒప్పందం ప్రకారం సీసీడీఎంసీకి 42 శాతం ఇచ్చి 58 శాతం తాము తీసుకుంటాయి. అంటే సింగపూర్ సంస్థలు పైసా పెట్టుబడి పెట్టకుండానే ఈ రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసి లాభం పొందబోతున్నాయన్నమాట.

రైతుల భూముల్లో, ప్రభుత్వ సొమ్ముతో (ప్రజాధనంతో) మౌలిక వసతులు కల్పించిన ప్లాట్లను తాము నచ్చినవారికి, నచ్చిన మొత్తానికి విక్రయించే ‘రియల్’ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలను ఆర్జించబోతున్నాయి. ప్లాట్లను పొందేది ఎవరనేది కూడా స్విస్ చాలెంజ్ డాక్యుమెంట్‌లో పేర్కొనలేదు. ప్లాట్లను వేలం వేస్తామని గానీ, ఎక్కువ మొత్తం ఇచ్చే వారికే విక్రయిస్తామని గానీ డాక్యుమెంట్‌లో ఎక్కడా వివరించలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మార్కెటింగ్ కంపెనీకి ఇష్టమైన వారికే (కంపెనీలకే) ఈ ప్లాట్లు దక్కబోతున్నాయనేది స్పష్టమౌతోంది.
 
సింగపూర్ కంపెనీల పెట్టుబడి ఎంత?

ఏడీపీలో సింగపూర్ సంస్థలు ఈక్విటీ కింద పెడుతున్న పెట్టుబడి కేవలం రూ.306 కోట్లు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు ఉచితంగా ఇస్తున్న 50 ఎకరాల విలువే రూ.300 కోట్ల రూపాయలుంటుంది. అంటే సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి కేవలం 6 కోట్ల రూపాయలన్నమాట. ఈ 50 ఎకరాల్లో సింగపూర్ సంస్థలే ఐకానిక్ నిర్మాణాలను చేసి విక్రయించుకుంటాయి. ఇందులో ప్రభుతానికి గానీ, ఏడీపీకిగానీ ఎలాంటి భాగస్వామ్యమూ ఉండదు.  ఇది కాక మిగతా రెండు దశల్లో  సింగపూర్ కంపెనీలకు 200 ఎకరాలను బేసిక్ ధరకు కేటాయిస్తారు.

ఆ 200 ఎకరాలపైన కూడా సింగపూర్ సంస్థలకే హక్కు ఉంటుంది. సింగపూర్ సంస్థల ప్రాజెక్టు వ్యయం 3,137 కోట్ల రూపాయలుగా పేర్కొన్నా అందులో మార్కెటింగ్, ప్రచారం, కన్సల్టెంట్ల ఫీజులు, ఐకానిక్ టవర్ వ్యయం కలగలసి ఉన్నాయి. ఈ వ్యయాన్ని కూడా సింగపూర్ కంపెనీలు, సీఆర్‌డీఏలు ఈక్విటీల ద్వారా, అలాగే తొలి దశ లాభాలు, భూముల విక్ర యం ద్వారా రాబట్టనున్నారు. అంటే పైసా పెట్టుబడి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేత మౌలిక వసతుల కల్పనకు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయించి కోట్ల రూపాయల లాభాలను సింగపూర్ సంస్థలు ఆర్జించనున్నాయన్నమాట.

ఈ విధమైన మార్కెటింగ్, లే- అవుట్లు చేసి విక్రయించడానికి సింగపూర్ కంపెనీలు ఎందుకో సర్కారు పెద్దలకే తెలియాలి. సింగపూర్ సంస్థలు కేవలం లే అవుట్లను ప్లాట్లగా థర్డ్‌పార్టీలకు విక్రయించే బ్రోకరేజీ పని చేయనున్నాయి. భవనాలు నిర్మాణం, ప్లాట్ల అభివృద్ధి థర్డ్‌పార్టీ కంపెనీలే చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలను గానీ, రహదారుల నిర్మాణాల నిర్మాణాలను గానీ సింగపూర్ సంస్థలు చేయవు. వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సి ఉంది.   
 
మార్కెటింగ్ కోసం మేనేజ్‌మెంట్ కంపెనీ
సింగపూర్ కంపెనీల మరో మాయాజాలం
అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ (ఏడీపీ)లో సింగపూర్ కన్సార్షియం, కేపిటల్‌సిటీ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి ఉన్నా అంతా సింగపూర్ కంపెనీలు చెప్పినట్లే జరుగుతోంది. సింగపూర్ కన్సార్షియంకు 58శాతం వాటా, సీసీడీఎంసీకి 42శాతం వాటా.. చూస్తేనే ఈ విషయం అర్ధమౌతోంది. అయితే స్విస్ చాలెంజ్ విధానంలో దశలవారిగా జరిగే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియలో కార్యకలాపాల నిర్వహణ బాధ్యత అంతా చూడడం కోసం ఓ మేనేజ్‌మెంట్ కంపెనీని నియమించనున్నారు.

మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఆస్తుల నిర్వహణ వంటి వ్యవహరాలన్నీ ఈ కంపెనీయే చూస్తుంది. లేఅవుట్లు, ప్లాట్ల గురించిన ప్రచార కార్యక్రమం కూడా ఇదే నిర్వహిస్తుంది. ఒక్కో దశలో ఐదేళ్లపాటు ఈ వ్యవహారాలన్నీ ఈ కంపెనీ నెరవేరుస్తుందని స్విస్‌చాలెంజ్ ప్రతిపాదనలలో పేర్కొన్నారు. అందుకయ్యే ఖర్చులన్నిటినీ ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఏఏ ఖర్చులుంటాయో వాటికి ఎంత చెల్లించాలో కూడా ఆ ప్రతిపాదనలలో ప్రస్తావించారు. వాటి వివరాలివీ..
1. డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కి.. - ప్రాజెక్టు వ్యయంలో 5.5శాతం
2. మార్కెటింగ్ సర్వీసులకు...
 - మొత్తం అమ్మకాలలో 2శాతం లేదా థర్డ్‌పార్టీకి చెల్లించే ఫీజు + 0.75శాతం మార్జిన్‌లలో ఏది ఎక్కువైతే అది
3. థర్డ్‌పార్టీ ఏజెంట్లను లేదా బ్రోకర్లను నియోగిస్తే...
 - బ్రోకరేజీకి అయ్యే వాస్తవ ఖర్చులు + 20శాతం
4. లీజ్‌మేనేజ్‌మెంట్ సర్వీసులు.. - మొత్తం ఆదాయంలో 1శాతం
5. ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసులు - మొత్తం ఆదాయంలో 2శాతం
ఇవి కాక అద్దెకు తీసుకునే ఆస్తులకు సంబంధించిన మార్కెటింగ్ సర్వీసులకు కూడా ఫీజులు వసూలు చేయనున్నారు. ఏడీపీ పేరుతో అభివృద్ధి చేసే ప్లాట్లను థర్డ్‌పార్టీకి విక్రయించడం కోసం ప్రచారం, మార్కెటింగ్ నిర్వహించే ఈ మేనేజ్‌మెంట్ కంపెనీ అందుకోసం రకరకాల ఫీజుల పేరుతో భారీమొత్తంలో వసూలు చేస్తుంది. అవన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని సింగపూర్ కంపెనీలు 58శాతం, సీసీడీఎంసీ 42శాతం తీసుకుంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement