సింగపూర్ కంపెనీలపై ప్రేమతో..
- స్విస్ చాలెంజ్‌పై ఆ కంపెనీల పాత ప్రతిపాదనతోనే వారంలోగా మళ్లీ నోటిఫికేషన్
- ఏపీఐడీఈ చట్టంలో సవరణలతో కొత్త నోటిఫికేషన్ జారీ..
- రెవెన్యూలో ప్రభుత్వ వాటా ఎంతో చెప్పాల్సిన పనిలేదు
- ఆసక్తి గల బిడ్డర్ అంటే.. అర్హత గల బిడ్డరే
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ కోరలు పీకేసిన సర్కారు
- పలు సెక్షన్లలో అథారిటీ పేరు తొలగింపు
- పారదర్శకతకు పాతర.. ఆడిట్ సెక్షన్ లేదు
సాక్షి, అమరావతి : సింగపూర్ కంపెనీలే తనకు ముఖ్యమనేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకెళుతున్నారు. ఆరునూరైనా రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ కంపెనీలతోనే చేయాలని నిర్ణయించారు. సింగపూర్ కంపెనీలు గతంలో చేసిన ప్రతిపాదనలతోనే వారంలోగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. గతంలో స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు వేసిన బ్రేకులను ఆర్డినెన్స్ ద్వారా తొలగించేశారు. తాను అనుకున్నట్లు చేయడానికి ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వం.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి అధికారాలు లేకుండా కోరలు పీకేసింది. అంతేగాక సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా చట్టంలో మార్పులు చేసింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఎంత ఇచ్చేది కంపెనీలు చెప్పాల్సిన అవసరం లేదనే నిబంధన ఉండటం విశేషం.
గతంలో హైకోర్టు బ్రేక్
సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా భూములు కట్టబెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు ఇటీవల హైకోర్టు బ్రేక్ వేసింది. స్విస్ చాలెంజ్‌పై హైకోర్టులో విచారణ సందర్భంగా జడ్జీలు చేసిన వ్యాఖ్యలను గమనించిన ముఖ్యమంత్రి.. తొలుత ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసుకుంటామన్నారు. కొత్త నోటిఫికేషన్ పిలవాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేశారు. అయితే హైకోర్టు తప్పు పట్టిన అంశాలను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలుకలిగించే చట్టంలో సవరణ ద్వారా తొలగించి.. ఆ తరువాత ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా సింగపూర్ కంపెనీలు గతంలో చేసిన ప్రతిపాదనలతోనే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
సింగపూర్ కంపెనీలు ఇచ్చిన ప్రతిపాదనలను ఎవరైనా చాలెంజ్ చేయవచ్చుననే నిబంధనతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అయితే రాజధాని ప్రాంతంలో సింగపూర్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రభుత్వానికి రెవెన్యూ వాటా ఎంత ఇచ్చేది కంపెనీలు చెప్పాల్సిన అవసరం లేదని చట్టంలో సవరణలు చేశారు. కేవలం ప్రతిపాదకుని వ్యవహార ప్రణాళిక, సాంకేతిక సమాచారం, డిజైనులు మాత్రమే వెల్లడిస్తారని, ప్రతిపాదకుడు ఇవ్వచూపిన ఆదాయ వాటా వెల్లడించరని ఆర్డినెన్స్‌లో స్పష్టం చేశారు.
సింగపూర్ కంపెనీలు చెప్పినట్టే చట్టసవరణ
హైకోర్టు విచారణలో రెవెన్యూ వాటా వెల్లడే కీలకంగా మారిన విషయం తెలిసిందే. సింగపూర్ కంపెనీలకు వచ్చే ఆదాయం ఎంత? అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారో చెప్పకుండా ఎలా చాలెంజ్ చేస్తారనేది హైకోర్టు విచారణలో పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. రెవెన్యూ వాటా ఎంత అనేది సింగపూర్ కంపెనీలు వెల్లడించవద్దు అన్నాయని తొలి నుంచి ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఆ రెవెన్యూ వాటా చెప్పకుండా ఉండేందుకు ఏకంగా చట్టంలోనే సవరణలు చేశారు. అలాగే ఆసక్తి గల బిడ్డర్లు అంటే అర్హత గల బిడ్డర్లేనని చట్టంలో సవరణలు చేశారు.
స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టులపై సీఎస్ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విశేష అధికారాలు ఉండేవి. అయితే ఆ అథారిటీకి అధికారాలు లేకుండా చేస్తూ ఆంధ్రప్రదేశ్ మౌలికసదుపాయాల అభివృద్ధి చట్టంలో 20 సెక్షన్లను చంద్రబాబు సర్కారు తొలగించేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే పదానికి బదులు ప్రభుత్వం అనే పదాన్ని ఉంచాలని కొన్ని సెక్షన్లలో సవరణలు తీసుకువచ్చింది. స్విస్ చాలెంజ్‌లో చేపట్టే ప్రాజెక్టులను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ నోటిఫై చేయాల్సిన పనిలేదని, ఇకపై స్విస్ చాలెంజ్‌లో ప్రాజెక్టులను ఆ అథారిటీకి పంపించాల్సిన అవసరం లేదని చట్టంలో మార్పులు చేశారు.
పారదర్శకతకు పాతర
ఏపీఐడీఈ చట్టం 2001 ప్రకారం స్విస్ చాలెంజ్ ప్రాజెక్టుల నిధుల వ్యవహారాలను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పర్యవేక్షించాలి. ఏటా వాటి ఆర్థిక లావాదేవీలను కాగ్ ఆడిట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఆ సెక్షన్‌ను పూర్తిగా తొలగించేశారు. అంటే పారదర్శకతకు, ఆడిట్‌కు అవకాశం లేకుండా సవరణలు తీసుకువచ్చారు. స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలను స్థానిక ఏజెన్సీ గానీ ప్రభుత్వశాఖ గానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపాలి. ఇప్పుడు సవరణల ద్వారా ఆయా ఏజెన్సీలు, శాఖలే ఆ ప్రతిపాదనలు పరిశీలించి ఆమోదించవచ్చు. స్విస్ చాలెంజ్‌లో పాల్గొనే సంస్థలకు పెట్టుబడి నిమిత్తం ఏ బ్యాంకులు ఎంత నిధులు సమకూరుస్తున్నాయి.. ప్రభుత్వ రాయితీలు ఏమిటనే వివరాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి సమర్పించాల్సి ఉండేది. దీన్ని తొలగించేశారు. సింగపూర్ కంపెనీలతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు, వీలుగా నోటిఫికేషన్ జారీకే ప్రభుత్వం మార్పులు చేసిందనే విమర్శలున్నాయి.