- స్విస్ చాలెంజ్ పద్ధతిన ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
- గత ఒప్పంద విలువ రూ.1,954 కోట్లు.. ప్రస్తుతం 7,284 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొమరవెల్లి మల్లన్నసాగర్ (తడ్కపల్లి) రిజర్వాయర్ నిర్మాణ పనులను పూర్తిగా పాత కాంట్రాక్టర్ల (మెయిల్, సూల జాయింట్ వెంచర్)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్ స్వరూపం పూర్తిగా మారడం, సామర్థ్యం ఏకంగా ఒక టీఎంసీ నుంచి 50 టీఎంసీలకు పెంచిన నేపథ్యంలో దీన్ని పూర్తిగా కొత్త కాంట్రాక్టర్‌కే అప్పగించాలని మొదట నిర్ణయం జరిగినా.. పాత స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారమే పనిచేస్తామని పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ ముందుకు రావడంతో స్విస్ చాలెంజ్ పద్ధతిన వారికే అప్పగించాలనే నిర్ణయం చేసింది. దీంతో గతంలో రూ.1,954 కోట్ల పనులు చేసిన సదరు సంస్థ ఇప్పుడు ఏకంగా రూ.7,284 కోట్ల పనులు చేజిక్కించుకున్నట్లయింది.
160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్లు లేని దృష్ట్యా, సిద్దిపేటలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్(పాములపర్తి)ను ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచుతూ నిర్ణయం చేసింది. ఇందులో ఇప్పటికే పాములపర్తి రిజర్వాయర్ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించగా.. మల్లన్నసాగర్ విషయంలో ప్రస్తుత నిర్ణయం చేశారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఉన్న ప్యాకేజీ 12ను ప్రస్తుతం రెండుగా విభజించారు. ఇందులో 12(ఎ)లో ప్రధాన కాల్వలు, ఇతర డిస్ట్రిబ్యూటరీల వాస్తవ నిర్మాణ వ్యయం అంచనా రూ.1,864 కోట్లు ఉండగా, దాన్ని 4.86 శాతం అధికంగా కోట్ చేయడంతో దాని వ్యయం రూ.1,954.59 కోట్లకు చేరింది. దీనికి తోడు మారిన పనుల కారణంగా మరో రూ.1,550.52 కోట్లు అదనంగా పెరిగింది. దీనికితోడు ప్యాకేజీ 12(బి)లో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ నిర్మాణ వ్యయాన్ని వేరుగా అధికారులు లెక్కగట్టారు. ఈ అంచనా వ్యయం విలువ రూ.5,734.45 కోట్లుగా తేలింది. ఇందులో డిస్ట్రిబ్యూటరీ, కాల్వలకు పెరిగిన వ్యయానికి సంబంధించిన పనులను సైతం పాత కాంట్రాక్టర్లకే అప్పగించి, రిజర్వాయర్ పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించినా, తర్వాత తన నిర్ణయాన్ని మార్చి మొత్తంగా రూ.7,284.96 కోట్ల పనులను స్విస్ చాలెంజ్ పద్ధతిన పాతవారికే ఇవ్వాలని నిర్ణయించింది.
భూసేకరణ ప్రయోజనాల కల్పనపై చర్చలు
ఈ ప్రాజెక్టు భూసేకరణ, పరిహారం విషయంలో నెలకొన్న అంశాలపై మంగళవారం నీటిపారుదలశాఖ అధికారులు చర్చించారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, స్థానిక చెరువుల్లో చేపలు పట్టుకునే అవకాశం, ఇతర ప్రయోజనాలు చేకూర్చే అంశాలతో ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇచ్చే విషయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషీతో ఈఎన్‌సీ మురళీధర్ చర్చలు జరిపారు.
మల్లన్న సాగర్ కాంట్రాక్టు పాత వారికే..!
Published Wed, Jun 15 2016 3:02 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement