పెళ్లికి నిరాకరించిందని..
ఉన్మాదిగా మారిన ప్రియుడు.. ప్రియురాలిపై కత్తితో దాడి
హైదరాబాద్: తనను ప్రేమిం చి.. మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైందన్న కారణంగా ఉన్మాదిగా మారిన ప్రియుడు ఆ యువతిని కత్తులతో పొడిచాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.ప్రస్తుతం కొరియర్ బాయ్‌గా పనిచేస్తూ నగరంలోని దుబాయ్ గేట్‌లో నివాసం ఉండే శ్రవణ్‌కుమార్(25), అదే ప్రాంతానికి చెందిన సుజాత(23) గతంలో క్వాలిటీ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. అయితే వీరి వివాహానికి సుజాత తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఆమె ఉద్యోగం వదిలి కొద్ది కాలంగా శ్రవణ్‌కు దూరంగా ఉంటోంది. శ్రవణ్.. పెళ్లి చేసుకుందామని వెంటపడుతుండడంతో.. తన బావతో వివాహం కుదిరిందని, మరచిపోవాలని కోరింది. ఇటీవల సోదరి కూతురును పాఠశాలకు తీసుకెళ్లిన సుజాతకు శ్రవణ్ తారసపడి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె ఈ విషయాన్ని ఇంట్లో తెలియజేయడంతో సుజాత సోదరుడు రాజు బుధవారం శ్రవణ్‌కుమార్ ఇంటికి వెళ్లి తన సోదరి వెంట పడవద్దని హెచ్చరించాడు.
ఉన్మాదిగా మారి దాడి..: ఇదిలా ఉండగా ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా గురువారం సుజాత తన స్నేహితురాలితో ఇక్రిశాట్ ఫేజ్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెంబడించిన శ్రవణ్ మార్గంమధ్యలో వారిని ఆపి పెళ్లి విషయం ప్రస్తావించాడు. దీనిపై సుజాత, శ్రవణ్‌ల మధ్య గొడవ జరిగింది. దీంతో ఉన్మాదిగా మారిన శ్రవణ్ ఆమెను కొట్టి కిందపడేశాడు. శ్రవణ్ వెంట తెచ్చుకున్న రెండు చిన్న కత్తులతో ఆమెపై కూర్చుని ఇష్టానుసారంగా పొడిచాడు. ఈ విషయాన్ని గమనించిన కాలనీవాసులు శ్రవణ్‌కుమార్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సుజాతను బీబీఆర్ ఆసుపత్రికి తరలించారు. శ్రవణ్‌కుమార్ ను అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.