సారీ మమ్మీ డాడీ.. నాకు బతకాలని లేదు!
ల్యాప్‌ట్యాప్‌లో సూసైడ్ నోట్ రాసి యువకుడు అదృశ్యం.
అంబర్‌పేట: ‘తమ్ముడూ పవన్ నాకు బతుకాలని ఆశలేదు... జీవితం మీద ఆసక్తి పోయింది. అమ్మనాన్నను బాగా చూసుకో. సారీ మమ్మీ, డాడీ’ అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు సోమవారం అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన జానకీరాజ్ కుమారుడు నిఖిల్‌రాజ్(25). ఎంబీఏ చదువుకొని ఓ కంపెనీ స్థాపిద్దామనే ఆలోచనతో అంబర్‌పేట బతుకమ్మ కుంట శాంతి నగర్‌లో స్నేహితుడు అజయ్‌కుమార్‌తో కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. తన సూసైడ్ నోట్ ల్యాప్‌ట్యాప్‌లో ఉందని, తన కోసం వెతకొద్దంటూ ఓ కాగితంపై రాసి.. దానిని ల్యాప్‌ట్యాప్ వద్ద పెట్టి సోమవారం వెళ్లిపోయాడు. నిద్ర లేచిన స్నేహితుడు అజయ్ 10 గంటల సమయంలో నిఖిల్‌రాజ్ ఎక్కడికి వెళ్లాడోనని ఫోన్ చేయగా స్విఛాప్ వచ్చింది. అదే సమయంలో ల్యాప్‌ట్యాప్ వద్ద సూసైడ్ నోట్ కాగితం కనబడగానే ఆందోళన చెంది అతను పోలీసులకు సమాచారం అందజేశాడు. గదికి వచ్చిన పోలీసులు ల్యాప్‌ట్యాప్ తెరిచి చూడగా సూసైడ్ నోట్ కనిపించింది. అందులో అమ్మ నాన్నలను బాగా చూసుకోమని తమ్ముడు పవన్‌ని అతను కోరాడు.
తాను స్థాపించబోయే కంపెనీ ప్రాజెక్ట్ వివరాలు డీ డ్రైవ్‌లో ఉన్నాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా తన అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయని వాటిని బదిలీ చేసుకోమని తెలిపాడు. తన ఆశయాన్ని కొనసాగించేలా కంపెనీని స్థాపించి గ్రామీణ ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నాడు. సూసైడ్ నోట్ చదివిన పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో బాగంగా అతను నల్లకుంట ప్రాంతంలోని ఓ ఏటీఎమ్‌లో భారీగా నగదు డ్రా చేసుకున్నట్టు తేలిందన్నారు.