
లైంగిక దాడి.. ఆపై హత్య
చందానగర్ : నల్లగండ్లలో 17 రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన బాలుడు కృష్ణటాపా (8) కేసును చందానగర్ పోలీసులు చేదించారు. చిన్నారిపై లైంగిదాడి చేసి.. హత్య చేసినట్టు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చందానగర్ సీఐ వాసు కథనం ప్రకారం.. నేపాల్ దేశానికి చెందిన శ్యామ్‌లాల్ టాపా, సంగీత టాపా నల్లగండ్ల సాయిశ్రీ అపార్టుమెంట్ సమీపంలో గుడిసె వేసుకుని కొడుకు కృష్ణ టాపాతో కలిసి ఉంటున్నారు.
సాయిశ్రీ డెవలపర్స్‌లో లేబర్‌గా పనిచేసే బీహార్‌కు చెందిన రామన్‌పటేల్(36) చిన్నారి కృష్ణటాపాను అప్పుడప్పుడు ఆడిస్తూ ఉండేవాడు. ఫిబ్రవరి 4న బాలుడి తండ్రి శ్యామ్‌లాల్ టాపా పనిపై పుట్టపర్తి వెళ్లాడు. 12న తల్లి సంగీత కూలి పనికి వెళ్లగా కృష్ణ టాపా గుడిసె ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో చాక్లెట్ ఇప్పిస్తానని రామన్‌పటేల్.. బాలుడిని నల్లగండ్ల హుడాలోని ఓపెన్ పార్కు వద్ద ఉన్న చెట్లపొదల్లోకి తీసుకెళ్లాడు. చెట్ల పొదల్లో రామన్‌పటేల్ కృష్ణ టాపాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు అరవడంతో భయపడ్డ నిందితుడు డ్రాయిర్‌తో గొంతు
నులిమి చంపేశాడు.
మిస్టరీ వీడిందిలా...
పుట్టపర్తికి వెళ్లిన మృతుడి తండ్రి శ్యామ్‌లాల్ టాపా 14న తిరిగి వచ్చాడు. అప్పటికే కొడుకు కనిపించడం లేదని భార్య చెప్పడంతో నాలుగు రోజుల పాటు గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో 18న చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 22న కుళ్లిపోయిన స్థితిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి వారి పక్క గుడిసెల్లో ఉంటున్న రామన్‌పటేల్ కనిపించడంలేదు. అనుమానం వచ్చిన పోలీసులు కేసును ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాగిన మైకంలో లైంగికదాడి చేసి, హత్య చేశానని రామన్‌పటేల్ తెలిపాడు. కాగా, కేసు మిస్టరీని ఛేదించిన ఎస్‌ఐలు సైదులు, లక్ష్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ విఠల్‌రెడ్డిలను సీఐ అభినందించారు.