- మద్యం మత్తులో సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి
- సింహాలకు దగ్గరగా వెళ్లి హాయ్ చెప్పిన ముఖేశ్
- నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఘటన
- క్షేమంగా బయటికి తీసుకొచ్చిన జూ కీపర్లు..అరెస్ట్ చేసిన పోలీసులు
- భార్యతో గొడవల వల్లే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకానన్న ముఖేశ్
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం 4.45 నిమిషాల సమయం.. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు.. ఆదివారం కావడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్న జూపార్కు.. ఇంతలో ఒక్కసారిగా కలకలం.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. సెక్యూరిటీ కళ్లుగప్పి ఎన్ క్లోజర్‌లోకి ప్రవేశించిన ఆ సందర్శకుడు సింహానికి షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనతో జూ అధికారులతో పాటు సందర్శకులు ఉలిక్కిపడ్డారు. అయితే జూ అధికారులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి అతడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మొత్తం మీద సాయంత్రం 4.45 గంటలకు ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన ముఖేశ్‌ను సాయంత్రం 5.15 గంటలకు బయటికి తీసుకొచ్చారు.
రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ముఖేశ్(35) ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ప్రాజెక్టులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం జూపార్కు సందర్శనకు ముఖేశ్ వచ్చాడు. సాయంత్రం 4.45 గంటలకు సింహాల ఎన్‌క్లోజర్ వద్దకు చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారించడంతో కొంతసేపు అక్కడే తచ్చాడాడు. ఇంతలో సందర్శకులు ఎక్కువ మంది ఎన్‌క్లోజర్ వద్దకు పోటెత్తారు. అదే సమయంలో ముఖేశ్ ఒక్కసారిగా సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు.
ఎన్‌క్లోజర్‌లోని నీటి మోడ్‌లో ఈదుకుంటూ సింహాలు ఉన్న వైపు వెళ్లి హాయ్ అంటూ పలకరించాడు. అతడిని చూసి ఒక సింహం వెనకడుగు వేయగా.. మరో సింహం అతడిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న జూ కీపర్లు పాపయ్య, బషీర్ సింహాల దృష్టిని మళ్లించి.. సింహాలను ఎన్‌క్లోజర్ గేట్ లోపలికి తీసుకువెళ్లారు. పొడవాటి చెక్కను ఎన్‌క్లోజర్‌లోకి పెట్టి ముఖేశ్‌ను సురక్షితంగా బయటికి రప్పించారు.
అనంతరం ముఖేశ్‌ను అదుపులోకి తీసుకున్న జూ అధికారులు అతడిని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. ముఖే శ్ ఎన్‌క్లోజర్‌లోకి దూకే సమయానికి మద్యం సేవించి ఉన్నాడని అధికారులు తెలిపారు. ముఖేశ్‌పై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భార్యతో ఉన్న చిన్నచిన్న గొడవల వల్లే సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకానని ముఖేశ్ పేర్కొన ్నట్లు పోలీసులు తెలిపారు.
గతంలో ఇలా..
గతంలో కూడా జూపార్కులో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఓ సందర్శకుడు పులికి బన్ను తినిపించేందుకు ప్రయత్నించగా.. అతడి చేతిని పులి కొరికేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ వారం తర్వాత మృతిచెందాడు. జూపార్క్‌లోని పులుల ఎన్‌క్లోజర్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ల ఎత్తు తక్కువ గా ఉండడంతో ఓ పులి బయటికి వచ్చింది. పులికి మత్తు మందు ఇచ్చి సురక్షితంగా జూలోకి పంపించారు. ఈ ఘటన తర్వాత రెయిలింగ్ ఎత్తును పెంచారే తప్ప.. సెక్యూరిటీ గార్డ్‌లను ఏర్పాటు చేయలేదు.
జూలో క్రూర మృగాల ఎన్‌క్లోజర్ల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించాల్సి ఉన్నా.. జూ అధికారులు గాలికి వదిలేసి నాలుగైదు ఎన్‌క్లోజర్లకు కలపి ఒక గార్డును ఏర్పాటు చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా అధికారులు స్పందించడం లేదు. అదే విధంగా గతంలో ఢిల్లీ జూలో ఓ సందర్శకుడు పులి పంజా బారిన పడి దుర్మరణం చెందిన విషయం విదితమే.
సింహంతో షేక్ హ్యాండ్..!
Published Mon, May 23 2016 1:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement