భల్లూకం భయపెట్టింది
జూ ఎన్‌క్లోజర్ దాటి ప్రహరీ ఎక్కి... గంటపాటు టెన్షన్
హైదరాబాద్: రాత్రి వేళ ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చిన భల్లూకం జూ సిబ్బందికి చెమటలు పట్టించింది. గోడ దూకి జంప్ అయ్యే ప్రయత్నంలో గంట పాటు టెన్షన్ పెట్టింది. చివరకు ట్రాంక్వలైజేషన్ దెబ్బకు స్పృహ తప్పి పడిపోయింది. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన మరోసారి అక్కడి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ఐదేళ్ల వయస్సున్న భల్లూకం సోమవారం రాత్రి ఎన్‌క్లోజర్ వెనుకున్న ఇనుప గొలుసుల ఫెన్సింగ్ ధ్వంసం చేసింది. అక్కడి నుంచి పక్కనే ఉన్న ప్రహరీ ఎక్కి... దానిపైనున్న ముళ్ల ఫెన్సింగ్‌ను దాటే ప్రయత్నం చేసింది. అయితే అవతలివైపు రహదారి, వ్యాపార సముదాయాలు ఉండటం... ఫెన్సింగ్ రెండడుగుల వెడల్పుతో ఏర్పాటు కావడం వల్ల కిందికి దూకలేకపోయింది. గంట సేపు ఆ గోడ మీదే చక్కర్లు కొట్టింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారంతో కళ్లు తెరిచిన జూ అధికారులు ఎలుగును పట్టుకొనేందుకు రంగంలోకి దిగారు.
స్వల్ప గాయాలు: గంటకు పైగా శ్రమించినా అది ఓ దారికి రాకపోవడంతో ప్రత్యేక తుపాకీ ద్వారా మత్తు మందు ఇంజక్షన్ (ట్రాంక్వలైజేషన్) ఇచ్చారు. స్పృహతప్పిన భల్లూకాన్ని ఎన్‌క్లోజర్‌లోకి చేర్చారు. ఎలుగుబంటికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే భల్లూకం పూర్తి ఆరోగ్యంగా ఉందని జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం తెలిపారు. ఎలుగుబంటి ప్రహరీ దూకి జనావాసాల్లోకి ప్రవేశించి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. కాగా, జూలో జంతువులకు, సందర్శకులకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సెల్ఫీ తీసుకొనే క్రమంలో వాటర్ ఫౌంటెయిన్ మీద నుంచి కింద పడి ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రహరీ ఎత్తు, కొత్త చైన్ లింక్‌ను ఏర్పాటు చేసి భద్రత పెంచుతామని జూ డెరైక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.