అతిగా మద్యం తాగడం వల్లే ?
హైదరాబాద్: అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న ఓ మహిళ భర్త ఊరెళ్లొచ్చేసరికి మరణించింది. నల్లకుంట ఎస్సై మహేందర్‌రెడ్డి కథనం... వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన జి.చలపతిరావుకు వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్‌కు చెందిన స్వరూప(30)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కడపలో ఉద్యోగం చేస్తున్న చలపతిరావు భార్యతో కలిసి అడిక్‌మెట్ లలితానగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. స్వరూపకు నిత్యం మద్యం తాగే అలవాటుంది.
విధి నిర్వహణలో భాగంగా చలపతిరావు ఈనెల 22న కడపకు వెళ్లగా... స్వరూప ఒక్కత్తే ఇంట్లో ఉంది. గురువారం ఉదయం 8.30కి ఇంటికి తిరిగి వచ్చి భర్త తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో చలపతిరావు చుట్టు పక్కల వారి సహాయంతో కిచెన్ డోర్ తెరిచి లోపలికి వెళ్లగా.. మంచంపై స్వరూప చలనం లేకుండా పడి ఉంది. వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వైద్యురాలిని పిలిపించగా.. అప్పటికే స్వరూప మృతి చెందినట్టు వెల్లడించింది. చలపతిరావు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, అతిగా మద్యం తాగే అలవాటు ఉన్న స్వరూపకు కాలేయం పూర్తిగా పాడైందని వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భర్త ఊరెళ్లొచ్చేసరికి భార్య మృతి
Published Fri, Feb 26 2016 2:07 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement