వరకట్న వేధింపులతో వివాహిత మృతి
మృతదేహంతో భర్త ఇంటి ముందు ఆందోళన
నాగోలు: అదనపు కట్నం కోసం భార్యను భర్త తీవ్రంగా కొట్టి చంపి ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేసిన ఘటన ఎల్‌బీనగర్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు... మన్సురాబాద్‌కు చెందిన బొల్లు భిక్షమయ్య, లక్ష్మమ్మల కుమార్తె సంతోషి (24)ను ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన మైలారం సురేశ్, ఆండాళు దంపతుల కుమారుడు మధు స్వరూప్‌కు ఇచ్చి 2012లో వివాహం జరిపించారు. రూ.10 లక్షల నగదు, రూ.30 లక్షల విలువ గల ప్లాట్, ఇతర సామగ్రితో వివాహం జరిపించారు.
అనంతరం అత్త, మామలతో కలిసి దంపతులు నగరానికి వచ్చి నాగోల్ వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్వరూప్ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. స్వరూప్ తండ్రి సురేశ్ అంబర్‌పేట ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. సంతోషి, స్వరూప్‌లకు శ్రీహంక్ (4) కుమారుడు ఉన్నాడు. వివాహ అనంతరం స్వరూప్ ఉద్యోగ రీత్యా బోయినపల్లికి మారాడు. అప్పటి నుంచి మరో రూ.25 లక్షలు కట్నం తీసుకురావాలని సంతోషిని వేధించసాగాడు. రాఖీల పండుగ సందర్భంగా భిక్షమయ్య తన కుమార్తెను ఇంటికి తెచ్చుకున్నాడు.
తరువాత అత్తగారింటికి వెళ్లకపోవటంతో మామ సురేశ్ వచ్చి కోడలు సంతోషినికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటామని చెప్పి ఈ నెల 25న బోయినపల్లికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు సంతోషి ఫోన్ చేసి భర్త మారలేదని, వేధింపులు ఎక్కువయ్యాయని, వేరే మహిళతో సంబంధం ఉందని, తనను వదిలించుకోవడానికే స్వరూప్ సిద్ధంగా ఉన్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం సంతోషి ఆత్మహత్య చేసుకున్నట్లు పక్కింటి వారు ఫోన్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి తన కుమార్తెను కట్నం కోసం చంపేశారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గాంధీ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నాగోలులోని వెంకటరమణ కాలనీకి తీసుకువచ్చారు. అప్పటికే స్వరూప్ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. బాధితులు ఇంటి తాళం పగులగొట్టి స్వరూప్ ఇంట్లో సంతోషి మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేస్ బోయినపల్లిలో అయినందున, అక్కడే పరిష్కరించుకోవాలని తెలిపారు. బోయినపల్లి పోలీసులు అప్పటికే స్వరూప్, మామ సురేశ్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. శనివారం సంతోషి అంత్యక్రియలు మన్సురాబాద్‌లో నిర్వహించారు.