ప్రజల విజ్ఞప్తుల దృష్ట్యా జిల్లా పేరు మార్పునకు సీఎం నిర్ణయం
హన్మకొండ జిల్లాపైనే ఉత్కంఠ
కొత్తగా నాలుగు డివిజన్లు.. 44 మండలాలు
తాజా నిర్ణయాలకు సీఎం ఆమోదం
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదాలో ప్రతిపాదించిన మల్కాజ్‌గిరి జిల్లాకు మేడ్చల్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల విజ్ఞప్తులతో పాటు చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా ఈ పేరు పెట్టేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. కీసర పేరును కూడా తీవ్రంగా పరిశీలించినప్పటికీ, చివరకు మేడ్చల్ వైపు మొగ్గుచూపారు.
ఈ మేరకు పేరు మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుకు లేఖ రాశారు. ముసాయిదాలో ప్రతిపాదించిన 27 జిల్లాలకు గాను 26 జిల్లాలపై అభ్యంతరాలేమీ లేవని సీఎం తేల్చేశారు.
తదుపరి ఏర్పాట్లలో నిమగ్నం కావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతిపాదిత హన్మకొండ జిల్లాపైనే మరింత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో హన్మకొండ జిల్లాను కొనసాగిస్తారా.. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న వరంగల్ రూరల్ జిల్లాను మనుగడలోకి తెస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలపై ఎప్పటికప్పుడు సాధ్యాసాధ్యాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న తొర్రూరు, కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్, మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తిలను కొత్త రెవిన్యూ డివిజన్లుగా చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు ఖమ్మం జిల్లాలో వైరా కేంద్రంగా ప్రతిపాదించిన రెవెన్యూ డివిజన్‌ను కల్లూరు కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు.
ఈ మార్పుచేర్పులకు సీఎం ఆమోదం తెలిపారు. ఇప్పటికే నోటిఫై చేసిన మండలాలకు అదనంగా రంగారెడ్డి జిల్లాలో కోటపల్లి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో గుండాల, పినపాక మండలాలను రెండుగా విభజిస్తారు. ఆల్లపల్లి, కరకగూడెం కేంద్రాలుగా రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేస్తారు. పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 45 మండలాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రజల డిమాండ్లను పరిశీలించిన సీఎం, మరిన్ని కొత్త మండలాలకు ఆమోదం తెలిపారు. ప్రతిపాదనల మేరకు కొత్తగా మరో 44 మండలాల ఏర్పాటు జాబితా సిద్ధమైంది.
ప్రతిపాదిత కొత్త డివిజన్లు: తొర్రూరు, హుస్నాబాద్, కల్వకుర్తి, వైరాకు బదులు కల్లూరు
ప్రతిపాదిత కొత్త మండలాలు (మొత్తం 44):
ఆదిలాబాద్(3): పెంచికల్‌పేట, ఆదిలాబాద్ రూరల్, చింతమానుపల్లి
నిజామాబాద్(7): బీబీపేట, చందూరు, ఎరగట్ల, ఆర్మూర్ రూరల్, దేవక్కపేట, పెద్దకొడపగల్, రెంజెర్ల
మహబూబ్‌నగర్(5): సిద్ధాపూర్, వంకేశ్వర్, చారకొండ, చండూరు, మోపల్
నల్లగొండ (4): నేరెడుగొమ్మ, అడవిదేవులపల్లి, నాగార్జునసాగర్, మద్దిరాల
మెదక్(7): నాగల్‌గిద్డ, హవేలీ ఘన్‌పూర్, మొగుడంపల్లి, కంది, వట్పల్లి, నార్సింగి, రాయిపోల్
కరీంనగర్(10): జగిత్యాల రూరల్, బసంత్‌నగర్, వీర్నపల్లి, బీర్‌పూర్, రుద్రంగి, కట్కూరు, బుగ్గారం, సిరిసిల్ల రూరల్, పంకెన, వేములవాడ రూరల్
ఖమ్మం(4): ఆల్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, చెంచుపల్లి, కరకుగూడెం
రంగారెడ్డి(2): కోటిపల్లి, మేడిపల్లి
వరంగల్(2): టేకుమట్ల, చిన్నగూడూరు