పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
సాక్షి, మేడ్చల్ జిల్లా: జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం నత్తలకే నడక నేర్పిస్తోంది. నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో రూ.150 కోట్ల వ్యయంతో 2840 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 12 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1050 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, మిగతా 1790 ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఇందులో 40 శాతం ఇళ్లు మాత్రం టెండర్లు, బేసిమెంట్ దశలకే పరిమితమైంది. ఇళ్ల పనులు సకాలంలో పూర్తయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు జిల్లా అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం జిల్లాలో గృహ నిర్మాణ శాఖను రద్దు చేయటంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖలు నిర్వహిస్తున్నాయి.
ఇళ్ల నిర్మాణం ఇలా ..
జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖ అధ్వర్యంలో 12 ప్రాంతాల్లో 1050 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా, ఇప్పటి వరకు 560 ఇళ్లు మాత్రమే సత్వరమే లబ్దిదారులకు కేటాయించేందుకు వీలుగా ఉన్నాయి. మిగతా ఇళ్లకు సంబందించి కరెంటు, రోడ్లు తదితర కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కీసరలో 50 ఇళ్లు, యాద్గార్‌పల్లిలో 40, పీర్జాదిగూడలో 74, పర్వతాపూర్‌లో 40, చెంగిచర్లలో 40 , తుర్కపల్లిలో 40 ఇళ్లు ,కిష్టాపూర్‌లో 80, సోమారంలో 30 , చీర్యాలలో 40, బోడుప్పల్‌లో 74, ఘట్కేసర్‌లో 50 ఇళ్లు, కొర్రెములలో ఒకటి ఇంటి నిర్మాణం పూర్తయ్యింది. మిగతా 490 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా ఆయా ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. జిల్లాలో పంచాయతీ రాజ్ (పీఆర్) శాఖ అధ్వర్యంలో 33 ప్రాంతాల్లో 1790 డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పీఆర్ అధ్వర్యంలో శ్రీరంగవరం, గిర్మాపూర్, గౌడవెళ్లి, రాజబోల్లారం, పూడుర్, నారాయణపూర్, అనంతారం, జగ్గంగూడ, తుర్కపల్లి, అలియాబాద్, కీసర, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, చీర్యాల, యాద్గార్‌పల్లి, కేశవపూర్, చౌదరిగూడ, నారపల్లి, అవుషాపూర్, పోచారం, ప్రతాప్‌సింగారం, మేడిపల్లి, బోడుప్పల్, పర్వాతాపూర్, లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, కేశవరం, యాడారం, ఉప్పరపల్లి, డబీల్‌పూర్, ఏదులాబాద్, శామీర్‌పేట్ ప్రాంతాల్లో 1790 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment