వైద్య రహిత హెల్త్‌కార్డులు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగులకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదురహిత వైద్యం కలగానే మిగిలిపోయింది. హెల్త్‌కార్డులు ఇచ్చినప్పటికీ వాటితో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం పొందే అవకాశం కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది. హెల్త్‌కార్డుల ప్రీమియంను ఉద్యోగుల నుంచి ఆరు నెలలుగా వసూలు చేస్తున్నా.. కార్పొరేట్ ఆసుపత్రులతో పూర్తిస్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీలు తమకు గిట్టుబాటు కావడం లేదని కార్పొరేట్ ఆసుపత్రులు తేల్చిచెబుతున్నాయి.
ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసుపత్రుల ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమైనా.. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. నగదు రహిత వైద్య పథకాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొస్తామంటూ మంత్రి చేసిన ప్రకటనలు వాస్తవరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం లో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి రోడ్‌మ్యాప్ రూపొం దించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం జరగాల్సిన ఈ భేటీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది.
పెన్షనర్ల ఆవేదన: పెన్షనర్లు వైద్యం చేయించుకోవడానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న చాలా కాలానికి, పెట్టిన ఖర్చులో గరిష్టంగా 80 శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. హెల్త్‌కార్డులతో సమస్యలు తీరుతాయని ఆశించినపెన్షనర్లకు నిరాశే ఎదురైంది. పెన్షన్‌లో ప్రీమియం కోత విధిస్తున్నా.. హెల్త్‌కార్డులపై ప్రభుత్వం వైద్యం అందించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్త్‌కార్డుల పథకం అమలుకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.