ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు రాష్ట్ర ప్రభు త్వం ఫీజులు ఖరారు చేసింది. గతేడాది జూన్‌లో జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ వైద, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం తాజా ఉత్తర్వులు జారీ చేశారు. చికిత్స సందర్భంగా నిర్వహించే కీలకమైన పరీక్షలు, పీపీఈ కిట్లు, అంబులెన్స్ తదితర వాటికి సంబంధించి ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. సాధారణ ఐసోలేషన్ వార్డులో చికిత్సకు రోజుకు రూ.4 వేలు, ఐసీయూలో రోజుకు రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్‌తో కలుపు కొని రోజుకు రూ.9 వేలు ఫీజుగా తీసుకోవాలి. అయితే ఇందులో కొన్ని పరీక్షలు కూడా కలిపి ఉంటాయి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రొటీన్ యూరిన్ పరీక్ష, హెచ్‌ఐవీ, హెపటైటిస్ సీ. హెపటైటిస్ బీ, సిరమ్ క్రియేటినైన్, అల్ట్రాసౌండ్, 2డీ ఎకో, ఎక్స్ రే, ఈసీజీ పరీక్షలు ఫీజులో కలిసి ఉంటాయి. అలాగే ఆ సందర్భంగా అవసరమైన మందులు, డాక్టర్ కన్సల్టేషన్, బెడ్, భోజనం ఖర్చులు కూడా కలిసే ఉంటాయి. మూత్రనాళంలో గొట్టం ఏర్పాటు చేయడం వంటివి కూడా ఉంటాయి.
ఖరీదైన మందులు ఎమ్మార్పీపైనే..
ఇక బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్లు, సెంట్రల్ లైన్, కీమోపార్ట్ ఇన్‌సెర్షన్, బయాప్సీ, పొట్టలో నుంచి ద్రవాన్ని తీయడం తదితరమైన వాటికి అదనంగా వసూలు చేసుకోవచ్చు. అయితే వీటికి 2019 డిసెంబర్ 31 నాటికి ఎంత ధర నిర్ధారించారో అంతే వసూలు చేయాలి. అలాగే ఇమ్యూనో గ్లోబిన్స్, మెరో పెనిమ్, పేరెంటల్ న్యూట్రిషన్, టొసిలిజుమాబ్ వంటి అధిక ధరలున్న మందులు రోగికి ఇవ్వాల్సి వస్తే అప్పుడు.. వాటికి ఎంఆర్‌పీ ప్రకారం వసూలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఆరోగ్య బీమాతో చేయించుకునే చికి త్సకు వర్తించవు. ఉదాహరణకు ఎవరైనా ఆరోగ్య బీమాతో ఆసుపత్రిలో చేరితే ఈ ఫీజులు వర్తించవు. ఆసుపత్రులు వారి పద్దతిలో ఆరోగ్య బీమా సంస్థల నుంచి వసూలు చేసుకోవచ్చని వైద్య వర్గాలు తెలిపాయి. సొంతంగా డబ్బులు చెల్లించి కరోనా వైద్యం చేయించుకునే వారికి మాత్రమే సర్కారు నిర్ధారించిన ఫీజులు వర్తిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
తాజాగా పీపీఈ కిట్ ధర, అంబులెన్స్‌కు వసూలు చేయాల్సిన సొమ్ముపై స్పష్టత ఇచ్చారు. ఒక్కో పీపీఈ కిట్‌కు గరిష్టంగా రూ.273 మాత్రమే వసూలు చేయాలి. దూర ప్రాంతాలకు సాధారణ అంబులెన్సులో వెళ్లాల్సి వస్తే కిలోమీటరుకు గరిష్టంగా రూ.75 చొప్పున వసూలు చేయాలి. ఆక్సిజన్, ఇతర సౌకర్యాలతో కూడిన అంబులెన్సులోనైతే కిలోమీటరుకు రూ.125 చొప్పున వసూలు చేయాలి. మామూలుగా సాధారణ అంబులెన్సుకు గరిష్టంగా రూ. 2 వేలు మాత్రమే తీసుకోవాలి. ఇతర వసతులున్న అంబులెన్సులో అయితే రూ. 3 వేలు మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలను కచ్చితంగా అమలు చేయాలనీ, అధిక ధరలు వసూలు చేసినట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అనసరంగా సీటీ స్కాన్లు, టెస్టులు చేయవద్దని ఆదేశించింది. ఇదిలావుంటే ఈ ఫీజులు, ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని కొన్ని కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కొన్ని నిర్ధారణ పరీక్షల ధరలు ఇలా ఉన్నాయి...
టెస్ట్ ధర (రూ.లలో)
హెచ్‌ఆర్‌సీటీ 1,995
ఐఎల్–6 1,300
డిజిటల్ ఎక్స్‌రే 300
డీ డైమర్ 800
సీఆర్‌పీ 500
ప్రొకాల్సిటోనిన్ 1,400
ఫెర్రిటిన్ 400
ఎల్‌డీహెచ్ 140
పదింతల జరిమానా విధించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన వాటికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆస్పత్రులకు ఇతర రాష్ట్రాల తరహాలో పదింతలు జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జీవోకు విరుద్ధంగా ఆస్పత్రులు వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మాత్రమే పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు, ల్యాబ్ పరీక్షల ఫీజులకు సంబంధించి ప్రభుత్వ జీవోపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. ప్రతి ఆస్పత్రిలో రిసెప్షన్, అకౌంట్స్ విభాగాలున్న ప్రదేశాల్లో బాగా కనిపించేలా జీవో అతికించాలని స్పష్టం చేసింది. కాగా, అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రుల నుంచి రోగులకు డబ్బు రిఫండ్ చేసేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment