బంగారంపై మెటల్ కోటింగ్!
- ట్రాలీ సూట్ కేస్‌కు బిగించి స్మగ్లింగ్
- దుబాయ్ నుంచి తెచ్చిన కర్ణాటక వాసి
- విమానాశ్రయంలో పట్టుకున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా బంగారం దేశంలోకి తీసుకొస్తున్న ఒకరిని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. పసిడిపై మెటల్ కోటింగ్ వేసి దుబాయ్ నుంచి తీసుకువస్తూ చిక్కాడు. కర్ణాటకకు చెందిన ఇతని నుంచి రూ.25.33 లక్షల విలువైన 866 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారు లు.. ప్రయాణికుల జాబితాను పరిశీలించారు.
కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రయాణికుడు హైదరాబాద్‌కు వస్తున్నట్లు గుర్తించారు. భత్కల్‌కు సమీపంలో బెంగళూరు, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నా.. హైదరాబాద్‌కు వస్తుండటం, అదీ ఇదే తొలిసారి కావడంతో అనుమానం వచ్చింది. దీంతో భత్కల్ వాసిని అదుపులోకి తీసుకుని.. అతని ట్రాలీ సూట్‌కేస్‌కు ఉండే మెటల్ పట్టీలను పరిశీలించారు. పట్టీలను బంగారంతో తయారు చేయించి వాటిపై మెటల్ కోటింగ్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ పట్టీల్లో 866 గ్రాముల బంగారం ఉన్నట్లు తేలింది. దీంతో భత్కల్ వాసిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే టికెట్ ధర తక్కువగా ఉన్నందునే హైదరాబా ద్‌కు వచ్చినట్లు అతడు చెబుతున్నాడు.