
45 రోజుల్లో మెట్రో భూసేకరణ పూర్తి
మెట్రోరైలు భూసేకరణ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్ణయించారు. మెట్రోరైలు పురోగతిపై ఆయన పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో టాస్క్ ఫోర్స్, పోలీసు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇకపై ప్రతి మంగళవారం నాడు మెట్రో టాస్క్ ఫోర్స్ బృందం భేటీ అవుతుంది.
షెడ్యూలు ప్రకారమే మెట్రోపనులు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంజీబీఎస్ వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించి ఆర్టీసీతో సంప్రదింపులు జరపనున్నట్లు రాజీవ్ శర్మ చెప్పారు. చిక్కడపల్లి, గోపాలపురం పోలీసు స్టేషన్లను వేరేచోటికి మార్చాలని నిర్ణయించామన్నారు. ప్రైవేటు భూములు, నష్టపరిహారం సమస్యలను త్వరగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీని సీఎస్ ఆదేశించారు.