మెట్రో రైలు పెద్ద స్కాం | Metro Rail is big Scam | Sakshi
Sakshi News home page

మెట్రో రైలు పెద్ద స్కాం

Published Mon, Mar 14 2016 12:46 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

మెట్రో రైలు పెద్ద స్కాం - Sakshi

మెట్రో రైలు పెద్ద స్కాం

అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపణ
♦ ఎల్‌అండ్‌టీ సంస్థకు ఆయాచిత లబ్ధి చేకూర్చారని ధ్వజం
♦ 12 వేల కోట్ల పెట్టుబడికి 37 ఏళ్లలో రూ.1,18,892 కోట్ల ఆదాయం
♦ ఈ ఒప్పందంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
♦ పాతబస్తీలో అలైన్‌మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్
♦ ప్రభుత్వ జాప్యం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది: కాంగ్రెస్
♦ మేం వచ్చాకే పనులు వేగం పుంజుకున్నాయి: మంత్రి కేటీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పెద్ద కుంభకోణమని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై రూ.12,654 కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ 37 ఏళ్ల ఒప్పంద కాలంలో వివిధ మార్గాల ద్వారా రూ.1,18,892 కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతుందన్నారు. మెట్రో స్టేషన్‌లో వాణిజ్య కార్యకలాపాలు, ప్రకటనలు, ప్రయాణ చార్జీలు, పార్కింగ్ తదితర మార్గాల్లో వచ్చే ఆదాయంతో ఎల్‌అండ్‌టీ సంస్థ భారీ లాభాలను గడి స్తుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఒప్పందంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వం, విపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మెట్రో రైలు నిర్మాణం కోసం 180.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని, చదరపు అడుగుకు కనీసం రూ.20 చొప్పున ప్రతినెలా రూ.38.10 కోట్ల అద్దె ప్రభుత్వానికి రావాల్సి ఉంటుందన్నారు. 35 ఏళ్లలో స్థలాలపై అద్దె రూపంలోనే ప్రభుత్వానికి రూ.16,002 కోట్లు రావాల్సి ఉంటుందని, ఈ అద్దెను ఎవరు వసూలు చేస్తారని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.  ఈ ప్రాజెక్టు కింద సేకరిస్తున్న భూముల్లో 60 శాతం పాతబస్తీలోనే ఉన్నాయని చెప్పారు. పాతబస్తీలో ప్రాజెక్టు అలైన్‌మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు.

 ప్రభుత్వం వల్లే జాప్యం: కాంగ్రెస్
 అలైన్‌మెంట్ మార్పు పేరుతో మెట్రో పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో ప్రాజెక్టు వ్యయం రూ.3 వేల నుంచి రూ.6 వేల కోట్ల వరకు పెరిగిందని, ఈ భారాన్ని ప్రయాణికులపై వేసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. అలైన్‌మెంట్ మార్పు సాధ్యం కాదని అఖిలపక్ష సమావేశంలో చెప్పినా సీఎం పట్టించుకోలేదన్నారు. ఏడాదిన్నర జాప్యం తర్వాత ఇప్పుడు మళ్లీ పాత అలైన్‌మెంట్‌తోనే పనులు ప్రారంభించడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

 రికార్డు సమయంలో పనులు చేశాం
 టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మెట్రో రైలు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. అతి తక్కువ సమయంలో 1,992 పిల్లర్లు, 2,780 సెగ్మెంట్లు, 43 కి.మీ.ల వయాడక్‌లను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించామన్నారు. ఇప్పటివరకు దాదాపు 74 శాతం ప్రాజెక్టు పూర్తై దన్నారు. ‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకోసారి ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నాం. అలైన్‌మెంట్ మార్పు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించిన మాట వాస్తవమే. అయితే ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ మార్గంలో అలైన్‌మెం ట్ మార్పు ఆలోచనను విరమించుకున్నాం. పాతబస్తీ మార్గంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై నగర ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తాం’’ అని వివరించారు.
 
 అవకతవకలకు ఆస్కారం లేదు: కేటీఆర్
 గ్లోబల్ బిడ్ ద్వారా గత ప్రభుత్వం మెట్రో ఒప్పందం చేసుకుందని, ఇందులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఒప్పందాలు మార్చడం సాధ్యంకాదన్నారు. రూ.14,132 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,458 కోట్ల నిధులను సమకూర్చిందని, మిగిలిన రూ.12,654 కోట్లను ఎల్‌అండ్‌టీ భరిస్తోందన్నారు. భూసేకరణ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం రూ.3 వేల కోట్లను అదనంగా ఖర్చు చేస్తోందన్నారు. పీపీపీ పద్ధతిలో 35 ఏళ్ల కాలానికి ఈ ఒప్పందం జరిగిందని మరో 25 ఏళ్లకు పెంచే అవకాశం ఉందన్నారు. చార్జీల రూపంలో 50 శాతం, వాణిజ్య కార్యకలాపాల ద్వారా 45 శాతం, ప్రకటనల ద్వారా 5 శాతం ఆదాయాన్ని మెట్రో రైల్ సంస్థ ఆర్జించనుందన్నారు. వాణిజ్య అవసరాల కోసం 212 ఎకరాల ప్రభుత్వ, 57 ఎకరాల ప్రైవేటు స్థలాలను కేటాయించామన్నారు. శ్లాబుల రూపంలో ప్రయాణ చార్జీలు రూ.8-రూ.19 లోపు ఉండాలని 2010లో నిర్ణయించారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ చార్జీలను రూ.13-25 మధ్య ఉండేలా నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement