మెట్రో రైల్ ప్రారంభం ఎప్పుడు?
- రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశ్న
- ప్రారంభోత్సవానికి తేదీలు ఖరారు చేస్తే ప్రధానిని తీసుకొస్తా..
హైదరాబాద్: ప్రతిష్టాత్మక మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి తెస్తుందో స్పష్టత ఇవ్వాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ దిల్‌కుషా అతిథి గృహంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌యాదవ్, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవ తేదీలను ఖరారు చేస్తే ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీని తీసుకొస్తానని చెప్పారు. రైల్వేకు సంబంధించి రాష్ట్రానికి భారీ కేటాయింపులు జరిగాయని తెలిపారు. ఆర్‌యూబీ, ఆర్‌వోబీలు, లెవల్ క్రాసింగ్‌లు, ఎంఎంటీఎస్ రెండో దశ నిర్మాణం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు బడ్జెట్లో రూ.1,729 కోట్లు కేటాయించారన్నారు.
మెదక్ నుంచి అక్కన్నపేట లైన్ నిర్మాణానికి రూ.610 కోట్లు, మునీరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ లైన్ నిర్మాణానికి రూ.350 కోట్లు, మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి లైన్‌కు రూ.300 కోట్లు, 12 ఆర్‌వోబీలు, 7 ఆర్‌యూబీలకు రూ.552 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ రెండో విడత కోసం తాజాగా రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నెల 8న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రీ డిజైన్ పనులు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. మెట్రో ప్రాజెక్ట్ పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం తన వాటా నిధులు వెంటనే విడుదల చేసి ప్రాజెక్ట్ పూర్తి చేసేలా కృషి చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లు తమ ప్రాంత రైల్వే ప్రాజెక్ట్‌ల సత్వర ఆమోదం, నిధుల విడుదల గురించి మాట్లాడారు.