సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు కారిడార్లు బ్యాంకాక్ లుక్ సంతరించుకోనున్నాయి. మెట్రో పిల్లర్లపై ఏర్పాటుచేసే వయాడక్ట్ సెగ్మెంట్ల కింద తీరైన ఉద్యానవనాలు,పూలకుండీలు,అద్భుత కళాఖండాలతో అందమైన ల్యాండ్‌స్కేప్ డిజైన్లు కొలువుదీరనున్నాయి. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని మిగిల్చనున్నాయి.
అక్టోబరు 31 లోగా ఈ డిజైన్లు సిద్ధం కానున్నాయి. పలు నగరాల నుంచి మొత్తం 78 మంది ఆర్కిటెక్టులు ల్యాండ్‌స్కేప్ డిజైన్లు సిద్ధం చేసేందుకు ముందుకు రాగా వీటిలో అత్యుత్తమంగా ఉన్న మూడు డిజైన్లను హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు స్వీకరించి నగరంలో ఆ మేరకు ల్యాండ్‌స్కేప్ తీర్చిదిద్దుతాయని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద కేంద్రం నుంచి నిధులు రాబడతామన్నారు. ల్యాండ్‌స్కేప్ డిజైన్ కాంపిటీషన్‌లో తుది దశకు ఎంపికైన అభ్యర్థులతో కలిసి ఆయన సోమవారం ఒక హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హెచ్‌ఎంఆర్ న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన విజేతలకు ప్రథమ బహుమతి కింద రూ.8 లక్షలు,ద్వితీయ బహుమతిగా రూ.6 లక్షలు,తృతీయ బహుమతిగా రూ.4 లక్షల నగదును అందజేస్తామన్నారు.
ల్యాండ్‌స్కేప్ డిజైన్లతో కనువిందు
మెట్రో రైలు కారిడార్లలో రహదారుల మధ్యలో పిల్లర్లను ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. పిల్లర్ల అడుగు(రోడ్డుమార్గంలో) మధ్యన 2.5 మీటర్ల వెడల్పు, ఒక మీటరు ఎత్తులో తీరైన ల్యాండ్‌స్కేప్ డిజైన్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో భాగంగా పూలు,క్రోటన్ మొక్కలు,రాతి కళాఖండాలు,తీగలు,పొదలతో కనువిందు చేసే మరుగుజ్జు చెట్లు కొలువుదీరడంతో ప్రయాణికులకు విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుందని ఎన్వీఎస్‌రెడ్డి చెప్పారు. కాగా ప్రతి మెట్రో స్టేషన్‌లో లక్ష లీటర్ల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంటుందని ఎండీ తెలిపారు. మెట్రో స్టేషన్లకు సమీపంలో సైకిల్‌ట్రాక్‌లను కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
రహదారుల విస్తరణకు రూ.600 కోట్లు..
నగరంలో మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న మెట్రో పనుల్లో భాగంగా ఆయా రూట్లలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా రూ.600 కోట్లతో ప్రధాన రహదారులను సాధ్యమైనంత మేర విస్తరిస్తామని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. రహదారుల విస్తరణకు ఇప్పటివరకు రూ.430 కోట్లు జీహెచ్‌ఎంసీకి కేటాయించామన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు ఇప్పటికే రూ.60 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. బ్యాంకాక్,సింగపూర్,టోక్యో,హాంకాంగ్,థైపి తదితర పట్టణాల్లోని మెట్రో ప్రాజెక్టుల అనుభవాలను పరి గణనలోకి తీసుకుని మన మెట్రోను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
నక్లెస్‌రోడ్డులో మెట్రో కోచ్ ప్రదర్శన ...
అక్టోబరు 2న మెట్రో మోడల్ కోచ్‌ను నక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమికి ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో ప్రదర్శనకు పెడతామన్నారు. వివిధ వర్గాల సలహాలు,సూచనలు స్వీకరిం చిన మీదట బోగీల్లో మార్పులు,చేర్పులు చేపడతామన్నారు.
‘మెట్రో’కు బ్యాంకాక్ లుక్...
Published Tue, Sep 24 2013 2:21 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement