వైద్యారోగ్యశాఖలో కొత్త పోస్టులు 4,000 | minister c laxma reddy speaks over new posts in medical and health department | Sakshi
Sakshi News home page

వైద్యారోగ్యశాఖలో కొత్త పోస్టులు 4,000

Published Sun, Aug 28 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

వైద్యారోగ్యశాఖలో కొత్త పోస్టులు 4,000

వైద్యారోగ్యశాఖలో కొత్త పోస్టులు 4,000

టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 2,118 పోస్టుల భర్తీ: లక్ష్మారెడ్డి
గాంధీ ఆసుపత్రిలో కొత్త బెడ్‌షీట్లు,
మంచాలు ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్:
వైద్య, ఆరోగ్య శాఖలో కొత్తగా నాలుగు వేల వైద్యులు, సిబ్బంది పోస్టులు మంజూరు చేయడంతోపాటు ఖాళీగా ఉన్న 2,118 పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నూతనంగా సమకూర్చిన మంచాలు, పరుపులు, బెడ్‌షీట్లను పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉందని, దీన్ని అధిగమించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 వేల పడకలు ఉండగా, వాటిలో తుప్పు పట్టిన, పాడైన 12 వేల పడకలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, సంపన్నులు, ప్రముఖులు కూడా వైద్యం పొందేలా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. ఉస్మానియాలో అత్యాధునిక వైద్యపరికరాలు, ఆధునిక హంగులతో ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. టీచింగ్ ఆస్పత్రుల్లో రెండు రంగుల (గులాబీ, తెలుపు) బెడ్‌షీట్లు, జిల్లా ఏరియా ఆస్పత్రుల్లో రోజుకో రంగు చొప్పున ఏడు రంగుల బెడ్‌షీట్లు వినియోగిస్తామన్నారు.

టీచింగ్ ఆసుపత్రుల్లో ఏడు రంగుల దుప్పట్లను వాడాల్సి వస్తే ఒక్కో రంగు దుప్పట్లు రెండు జతలు అవసరమని, దాని ప్రకారం నిర్వహించడం కష్టమని భావించి ప్రస్తుతం రెండు రంగులకే పరిమితమయ్యామని లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వైద్యారోగ్యశాఖ నిర్వహించే టెండర్లలో ఎల్1 సిస్టం కరెక్టు కాదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని లక్ష్మారెడ్డి అన్నారు. ఆరోగ్య రంగం విషయంలో గత ప్రభుత్వాలు మాటలు మాత్రమే చెప్పాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందని తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించామని లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతం 12 డయాలసిస్ సెంటర్లు ఉండగా, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో మరో 28 కేంద్రాలను త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement