వేషాలు మార్చుకోకపోతే ప్రజలు ఛీకొడతారు
రేవంత్, నాగంపై మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: మీ వేషాలు మార్చుకోకపోతే ప్రజలు ఛీ కొడతారని టీడీపీ, బీజేపీ నేతలు రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డిలను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాలమూరు ప్రాజెక్టుని ఆపాలని మహానాడులో చంద్రబాబు తీర్మానం చేస్తే అడ్డుకోని రేవంత్‌రెడ్డి... మల్లన్నసాగర్ వద్దకు వెళ్లి దీక్ష చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘మీరు మనుషులు కాదు.. దద్దమ్మలు... గుంటనక్కలు. మీవి దిగజారిన బతుకులు. మహిళలు మిమ్మల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది. రేవంత్... నువ్వు ప్రజల కాళ్లు మొక్కి చెంపలు వేసుకో. ఎవరు అడ్డొచ్చినా ప్రాజెక్టులు ఆగవు’ అని మంత్రి తీవ్రంగా హెచ్చరించారు.
తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలని నాగం జనార్దన్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లి మొట్టికాయలు వేయించుకుని మళ్లీ పిటిషన్ వేశారు. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా నాగం, రేవంత్ కావాలని ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. వారిద్దరూ తోడుదొంగలు. ప్రాజెక్టులు పూర్తై రాజకీయ మనుగడ ఉండదనే భయంతోనే ఇలా చేస్తున్నారు. కల్వకుర్తి, నెట్టెం పాడు, భీమా తదితర ప్రాజెక్టులకు 2004 నుంచి ఇప్పటి వరకు భూసేకరణ జరగలేదు. భూసేకరణ సమస్యతోనే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. 2013 భూసేకరణ చట్టంతో రైతులకు నష్టం జరుగుతుంది. ఆగస్టులో 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం’ అని మంత్రి చెప్పారు.
రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళదాం..
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ వాదనకు మద్దతుగా రాజీనామాలు చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు తాము సిద్ధమని, మీరు కూడా సిద్ధమా అంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు విపక్షాలకు సవాలు విసిరారు. సీఎం కేసీఆర్ 60 ఏళ్ల దరిద్రాన్నికడుగుతుంటే... స్వార్థ రాజకీయాల కోసం పెంపుడు కుక్కలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అభివృద్ధి జరిగితే తమకు పుట్టగతులు ఉండవని భయపడే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్, టీడీపీ నేతలపై మండిపడ్డారు. రేవంత్, నాగం మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నామన్నారు. విపక్షాలు దీక్షలు కాదు... రాజీనామాలు చేయాలన్నారు.