ప్రజాకోర్టులో శిక్ష తప్పదు
♦ వరంగల్ రైతు ధర్నాలో టీడీపీ, బీజేపీ నేతలు
♦ అన్నదాతలూ ఆత్మహత్యలు వద్దు
♦ పిడికిలి బిగించి ఉద్యమిద్దాం: కిషన్‌రెడ్డి
♦ కేసీఆర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయాలి: రేవంత్‌రెడ్డి
వరంగల్: రైతు ఆత్మహత్యలు ఆపలేని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని టీడీపీ, బీజేపీ నేతలు హెచ్చరించారు. రైతులు బలవన్మరణాలకు పాల్పడొద్దని, పిడికిలి బిగించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపీ, టీడీపీ సంయుక్తంగా రైతులకు భరోసా కల్పించేందుకు ఎనుమాముల మార్కెట్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించాయి. అనంతరం ఆయా పార్టీల నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఆ పార్టీ శాసన సభ పక్ష నేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌లతోపాటు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు సమస్యలపై ఉద్యమ బాట పడదామని పిలుపునిచ్చారు.
రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి బ్యాంకుల్లో ఉన్న పాస్ పుస్తకాలను రైతులకు ఇప్పించాలని డిమాండ్ చేశా రు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పులపై రెండేళ్లు మారటోరియం విధించాలన్నారు. ‘‘హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు నిర్మించడం కాదు. ముందు రైతు ఆత్మహత్యలు ఆపాలి. ఎడమ సంకలో కేటీఆర్, కుడి సంకలో హరీశ్‌రావు, భుజాలపై అక్బరుద్దీన్‌ను పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు’’ అని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లో ఉంటూ మందు ఎత్తి పోస్తున్నారని విమర్శించారు. ఆయనకు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని వ్యాఖ్యానించారు. ‘‘రైతుల రుణ మాఫీ కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేయాలని మేం అడగడం తప్పా? పోలీసులను అసెంబ్లీలోకి రప్పించి ప్రతిపక్ష సభ్యులను ఈడ్చుకెళ్లి బయటకు పడవేయించిన దుర్మార్గపు సీఎం కేసీఆర్’’ అని మండిపడ్డారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తున్నారని, ప్రపంచబ్యాంకుకు కట్టబెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రుణాలను వాయిదా పద్ధతిలో కాకుండా ఏకకాలంలో మాఫీ చేయాలని కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.