ఐటీ రంగంలో హైదరాబాద్ ముందంజ: కేటీఆర్
ఐటీ రంగంలో హైదరాబాద్ ముందంజ: కేటీఆర్
Published Wed, Mar 15 2017 2:34 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
హైదరాబాద్ : రాష్ర్టానికి ఐటీఐఆర్ వచ్చినా, రాకపోయినా ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శాసనమండలిలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలో అగ్ర భాగాన నిలవబోతుందన్నారు. ఐటీఐఆర్ పై ఇప్పటికే ఐదు సార్లు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి చర్చించానని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ ఇంత వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
ఐటీఐఆర్ వచ్చినా.. రాకపోయినా.. ఐటీ రంగంలో హైదరాబాద్ ముందంజలో ఉంటుందన్నారు. ఇక హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు పరిశ్రమలను విస్తరిస్తున్నామని తెలిపారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. సిద్ధిపేట, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో గ్రనైట్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఖమ్మంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. సిరిసిల్లలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి అనేది సమ్మిళితంగా జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు.
Advertisement
Advertisement