'ఎక్కడైనా నష్టాల్లోనే నడుస్తాయి'
హైదరాబాద్: సకాలంలోనే హైదరాబాద్ మెట్రో రైలు పూర్తి చేస్తామని తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. మెట్రో పనుల్లో ఎలాంటి జాప్యం జరగడం లేదని చెప్పారు. శాసనసభలో మెట్రో ప్రాజెక్టుపై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
రూ. 14,132 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. 2010లో అగ్రిమెంట్ కుదిరిందని, రెండేళ్ల వరకు పురోగతి లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పనులు వేగవంతం చేశామన్నారు. 15 రోజులకొకసారి సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో 25 కిలోమీటర్లు పూర్తి చేయడానికి ఏడున్నరేళ్లు, బెంగళూరులో 6 కిలోమీటర్లకు 7 ఏళ్లు, చెన్నెలో 8 కిలోమీటర్లు పూర్తి చేయడానికి 6 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. 72 కిలోమీటర్లు పూర్తి చేయడానికి ఎంతకాలం పడుతుందని ప్రశ్నించారు.
74 శాతం పనులు పూర్తయ్యాయని, 43 కిలోమీటర్ల పనులు వేగవంతంగా పూర్తిచేసిన రికార్డు నెలకొల్పామని చెప్పారు. పాతబస్తీలో 5.5 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. మెట్రో టికెట్ ధర రూ.13 నుంచి రూ. 25 ఉండే అవకాశముందన్నారు. ప్రజారవాణా వ్యవస్థలు ఎక్కడైనా నష్టాల్లోనే నడుస్తాయని కేటీఆర్ అన్నారు.