సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో నవీన్ మిట్టల్, డీఎస్ మిశ్రా తదితరులు
సాక్షి, హైదరాబాద్: సులభతర ప్రజా రవాణాకు పక్కా ప్రణాళిక తప్పనిసరి అని రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. హైటెక్స్‌లో 3 రోజులపాటు జరిగిన పదో అర్బన్ మొబిలిటీ ఇండియా–2017 సదస్సు సోమవారంతో ముగిసింది. కార్యక్రమ ముగింపు వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో 33 శాతం జనాభా పట్టణాల్లో ఉంటుండగా.. తెలంగాణలో 43 శాతం నగర జనాభా ఉందని చెప్పారు. 2030 నాటికి పట్టణ జనాభా 50 శాతానికి చేరుతుందని, భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్ల విస్తరణ, మెట్రో రైల్, ఫ్లై ఓవర్లు, స్కైవేలు మెరుగైన ప్రజా రవాణాకు పరిష్కారం కాదని, అవసరాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో మురికివాడల ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రత్యేక చొరవ తీసుకుని 560 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇంటిని రూ.8.7 లక్షల వ్యయంతో నిర్మించి ఇస్తుందని పేర్కొన్నారు. లబ్ధిదారుల వాటా సున్నా శాతమని స్పష్టం చేశారు. త్వరలో హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు, వాహనాలు రానున్నాయని పేర్కొన్నారు.
సమగ్ర ప్రణాళికే ఏకైక మార్గం
ఈ సదస్సులో 56 దేశీయ నగరాలు, 30 విదేశీ నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థ తీరుతెన్నులపై ఆయా నగరాల ప్రతినిధులు ప్రదర్శనలిచ్చారు. పట్టణీకరణ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజా రవాణాపై ప్రణాళిక లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజా రవాణా సమస్యలను అధిగమించే అంశంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ ఉన్నతాధికారి ఓపీ అగర్వాల్ ఇచ్చిన ప్రజెంటేషన్.. ప్రతినిధులను ఆలోచింపజేసింది. నగర పాలక సంస్థలు, ప్రభుత్వ విభాగాలన్నీ సమగ్ర ప్రణాళికను రూపొందించాలని అగర్వాల్ పేర్కొన్నారు. హోదా ప్రదర్శనలో భాగంగా కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని విమర్శించారు. ప్రతి నగరం ప్రజా రవాణాపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, ఉజ్జయినీ పట్టణాల్లో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారి వివేక్ అగర్వాల్ పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణంపై హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈనెల 28న ప్రధాని చేతులమీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి డీఎస్ మిశ్రా మాట్లాడుతూ ‘ఈరోజు ఉదయం హైటెక్ సిటీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు వెళ్లా. 10 కిలోమీటర్ల దూరం కూడా లేదు. కానీ వెళ్లడానికి గంట.. తిరిగి రావడానికి గంట పట్టింది’అంటూ హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను ఉటంకించారు. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇండియా–2018 వచ్చే ఏడాది నవంబర్ 2 నుంచి 4 వరకు నాగపూర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రజా రవాణాపై వివిధ కేటగిరీల్లో అవార్డులు
బెస్ట్ సిటీ: సూరత్ మున్సిపల్ కార్పొరేషన్
బెస్ట్ నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్: మైసూర్
బెస్ట్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాక్టీసెస్: జీహెచ్‌ఎంసీ, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్. వీటితో పాటు భోపాల్, లక్నో, నోయిడా, పుణె, తిరువనంతపురం నగరాలు అవార్డులు దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment