బుధవారం ఎస్‌ఆర్ నగర్–మియాపూర్ మార్గంలో మెట్రో రైలులో ప్రయాణిస్తున్న గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్ల నిర్వహణకు కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ (సీబీటీసీ)ను వినియోగించడం అద్భుతమని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు. ఈ సాంకేతికతతో డ్రైవర్ అవసరం లేకుండా మెట్రో రైళ్లను నడపడంతో పాటు ప్రతి రెండు నిమిషాలకు ఓ రైలును ఒక మార్గంలో నడపడం విశేషమన్నారు. మెట్రో ప్రయాణం అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యవంతంగా ఉందని కితాబిచ్చారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు కల్పించిన వసతులు భేష్ అని కొనియాడారు.
బుధవారం మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఇతర ఉన్నతాధికారులతో కలసి ఎస్‌ఆర్‌నగర్– మియాపూర్ మార్గంలో గవర్నర్ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ మార్గంలోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు కల్పించిన వసతులు, పట్టణ నవీకరణలో భాగంగా స్టేషన్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హరిత వాతావరణం, స్ట్రీట్ ఫర్నిచర్‌ను పరిశీలించారు. అనంతరం మియాపూర్ మెట్రో డిపోలో స్టేబ్లింగ్ యార్డు, రైళ్ల మరమ్మతుల కేంద్రాలను ఆయన పరిశీలించారు. మెట్రో స్టేషన్లను అత్యాధునిక డిజైన్లతో తీర్చిదిద్దడం, రైళ్లకు అడ్వాన్స్‌డ్ బ్రేకుల వ్యవస్థ వినియోగం వల్ల 40% ఇంధనం ఆదా అవుతుందని గవర్నర్ చెప్పారు. హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మియాపూర్ మెట్రో డిపో విశేషాలను గవర్నర్‌కు తెలియజేశారు. పాద చారుల మార్గాలు, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటుకు తీసుకున్న చర్యలను తెలిపారు. అనంతరం గవర్నర్ మియాపూర్ మెట్రో డిపో, స్టేషన్ సమీపంలోని హాకర్స్ ప్లాజా, ఆర్ట్‌స్పాట్, ఇనాగరల్ ప్లాజా ఏరియా, కియోస్క్‌లు, రిలాక్సేషన్ జోన్‌లను పరిశీలించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి...
ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన మెట్రో స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచే విషయంలో ప్రయాణికులకు అవగాహన కల్పించాలని గవర్నర్ హెచ్‌ఎంఆర్ అధికారులకు సూచించారు. ఈ విషయంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ విభాగాల సహాయంతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సీఎస్ ఎస్పీసింగ్, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment