మంత్రులు చెప్పినా మారరా?
జాతీయ రహదారిలో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు
కంటోన్మెంట్: రోడ్లపై ఇబ్బడి ముబ్బడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కోర్టులతో పాటు, సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెబుతున్నారు. అయినప్పటికీ అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలే ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. గల్లీ రోడ్లు, అంతర్గత రహదారులతో పాటు ఏకంగా జాతీయ రహదారిలోనూ పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అడ్డు చెప్పేవారే కరువయ్యారు. బోయిన్‌పల్లి చెక్‌పోస్టు సమీపంలో నాగ్‌పూర్ హైవేకు సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ సూచిక బోర్డు నిండా టీఆర్‌ఎస్ జెండాలే దర్శనమిస్తున్నాయి. సందర్భమేదైనా సరే.. కొన్ని నెలలుగా ఆ పార్టీ నేతలు తమ ఫ్లెక్సీలతో బోర్డును నింపేస్తున్నారు.
తాజాగా ఓ నేత జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దారి పొడవునా కొంపల్లి వరకు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ రహదారిపై వెళ్లే వారికి ఏ పట్టణం ఎంత దూరంలో ఉందో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. అంతే కాకుండా ఈదురు గాలులతో కూడిన వర్షాల సమయంలో ఫ్లెక్సీలు చిరిగిపోయి రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డు పడుతున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా భారీ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అయినప్పటికీ నేతల తీరు మారకపోవం గమనార్హం.