కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
మల్దకల్(గద్వాల) : రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమ వేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం కుర్తిరావల్‌చెర్వులో శుక్రవారం చోటు చేసుకోగా.. కాంగ్రెస్–టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.
ఎమ్మెల్యే రాకముందే...
చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కుర్తిరావల్‌చెర్వులో ఏర్పాటుచేశారు. అయితే, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డీ.కే.అరుణ రాకముందే టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్‌రెడ్డి గ్రామానికి చేరుకుని ఇన్‌చార్జి జేసీతో కలిసి పలువురు రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి టీఆర్‌ఎస్ నాయకులతో ఎలా చెక్కులు పంపిణీ చేయిస్తారని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి అధికారులతో వారించారు. దీంతో ఇరు పార్టీ నాయకుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.
వివాదానికి దారితీసిన ఫ్లెక్సీలు
చెక్కుల పంపిణీ కేంద్రంలో టీఆర్‌ఎస్ నాయకులతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా.. బయట రైతుల ఆత్మహత్యలు, రైతు సమస్యలు పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ పథకానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఫ్లెక్సీని తొలగించారు. అనంతరం ఎమ్మె ల్యే డీకే.అరుణ గ్రామానికి చేరుకోగా ఆ ఫ్లెక్సీని పంపిణీ కేంద్రం ముందు మళ్లీ ఏర్పాటు చేయించారు. కార్యక్రమానికి తాను వస్తున్నారనే విషయం తెలిసి కూడా ఏ హోదా లేని వ్యక్తితో ఎలా చెక్కులు పంపిణీ చేయిస్తారని ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే డీకే అరుణ సమక్షాన అధికారులు చూస్తుండగానే భాస్కర్ స్వయంగా ఆ ఫ్లెక్సీని చింపేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పక్కనే ఉన్న టీఆర్‌ఎస్ నాయకులతో కూడిన ఫ్లెక్సీని వారు తొలగించారు. ఈ మేరకు కోపోద్రిక్తులైన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీని తొలగించిన కాంగ్రెస్ కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపిస్తూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.
పరిస్థితి విషమించడంతో సీఐ వెంకటేశ్వర్లు పోలీసులతో కలిసి లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టారు. దీంతో సుమారు గంట పాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ సురేందర్‌రావు గ్రామానికి చేరుకుని ఇరుపార్టీల నాయకులకు సర్దిచెప్పారు. దాడి జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే డీకే. అరుణ సంఘటనా స్థలం నుంచి ఫోన్ ద్వారా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరికి ఫిర్యాదు చేశారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బండారి భాస్క ర్, ఎమ్మెల్యే డీకే. అరుణ వేర్వేరుగా రైతులకు చెక్కులు పంపిణీ చేసి విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ వేణుగోపాల్, మార్కె ట్ యార్డు చైర్‌పర్సన్ బండ్ల లక్ష్మీదేవి, తహసీల్దార్ వీరభద్రప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment