సాక్షి,హైదరాబాద్: గత ఏడాది మాదిరిగానే ఈసారీ టీఆర్‌ఎస్ ప్లీనరీని పురస్కరించుకొని పలువురు టీఆర్‌ఎస్ నేతలు నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల వంటివి భారీగా ఏర్పాటు చేశారు. వాటితో ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా ద్వారా పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకు స్పందించిన ఈవీడీఎంలోని సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌సెల్(సీఈసీ) ఈ చలానాల జారీ ప్రారంభించింది. వాటిని తొలగించే బాధ్యత మాత్రం తమది కాదంటూ జోనల్, సర్కిల్ అధికారులదని పేర్కొంది.
ట్విట్టర్ ద్వారా సీఈసీ ఖాతాకు అందిన ఫిర్యాదులకు స్పందిస్తూ.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నుంచి పార్టీ డివిజన్ స్థాయి నాయకుల వరకు పెనాల్టీల ఈ– చలానాలు జారీ చేస్తున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ఫ్లెక్సీలున్నప్పటికీ పౌరుల నుంచి అందిన ఫిర్యాదులకే పెనాల్టీలు వేయడంతో, పెనాల్టీలు పడనివి అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు.
► మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేరిట నగరంలోని జూబ్లీహిల్స్, కేబీఆర్‌పార్క్, పంజగుట్ట, నాంపల్లి, నారాయణగూడ, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, తార్నాక, ప్యాట్నీ ఈస్ట్‌మారేడ్‌పల్లి, మెట్టుగూడ, తదితర ప్రాంతాల్లో వెలసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదులకు ఈ– చలానాలు జారీ చేశారు. ఒక్కో ఫ్లెక్సీకి రూ. 5వేల వంతున చలానాలు జారీ అయ్యాయి.
► హైటెక్‌సిటీలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50 వేల వంతున రెండింటికి లక్ష రూపాయల చలానాలు జారీ చేశారు. పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట ఏర్పాటైన వాటికి, పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, తదితర డివిజన్ నాయకులు ఏర్పాటు చేసిన వాటికి పెనాల్టీలు విధించా రు. బుధవారం సాయంత్రం వరకు తలసానిపై ఇరవైకి పైగా, పార్టీ జనరల్‌సెక్రటరీపై దాదాపు ఇరవై ఫ్లెక్సీలకు ఈచలానాలు జారీ చేశారు.
► టీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్‌రెడ్డి హుస్సేన్‌సాగర్‌లో బోట్‌కు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు రూ. 50వేలు, రూ.15వేలు వంతున రెండు ఈ– చలానాలు జారీ అయ్యాయి. గచ్చిబౌలిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లికి చెందిన షేక్‌హమీద్‌కు లక్ష రూపాయల వంతున రెండు ఈ– చలానాలు జారీ చేశారు. ఈచలానాల జారీ ఇంకా కొనసాగుతుండటంతో కచ్చితంగా ఎంత మొత్తం అనేది తెలియడానికి సమయం పట్టనుంది.
తగ్గేదేలే..
► పెనాల్టీలు వేసినా తాము తగ్గేది లేదని, పార్టీపై.. అగ్రనాయకులపై తమ అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరన్నట్లుగా పలువురు నేతలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా ఫ్లెక్సీలు తదితరమైన వాటితో స్వాగతాలు పలికారు. పెనాల్టీలు పడినా సరే అధిష్టానం దృష్టిలో పడితే చాలన్నట్లుగా కొందరు వీటిని ఏర్పాటు చేశారు.
► ట్విట్టర్ వేదిక ద్వారా కొందరు పౌరులు టీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానాలు చేశారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లు కారు అని అన్న మీరే ఇలా వ్యవహరించారేం? అని ప్రశ్నించారు. మేం నిబంధనలు పాటించాలి కానీ మీ పార్టీ పాటించవద్దా అని పేర్కొన్నారు. బెంగళూర్‌లో ఫ్లెక్సీలు, గుట్కా, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారని పోస్ట్‌చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటదో తెలియని నగరంలో ఒక్కసారిగా గాలిదుమారం వీస్తే రోడ్డున పోయే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన వారూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment