
డబ్బులివ్వలేదని! అమ్మనే అంతమొందించాడు
మద్యం మత్తులో బాలుడి కిరాతకం
హైదరాబాద్: మత్తు పదార్థాలకు బానిసైన పద్నాలుగేళ్ల ఓ మైనర్ బాలుడు కన్న తల్లినే గొంతుకోసి హత్యచేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల శివలాల్‌నగర్‌లో చోటుచేసుకుంది. చదువును ఐదవ తరగతిలోనే ఆపి తల్లితో కలసి చిత్తు కాగితాలు ఏరుకుంటూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన బాలుడు అమ్మనే పొట్టనపెట్టుకున్నాడు. మంగళ్‌హాట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఎ. సంజీవరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఖైరతాబాద్‌కు చెందిన రేణుకా(45) పదేళ్ల క్రితం భర్త మృతిచెందగా, కొడుకుతో మంగళ్‌హాట్‌లోని శివలాల్‌నగర్‌లో అద్దెకు ఉంటోంది. రోడ్లపైన చిత్తు కాగితాలు ఏరుకొని అమ్ముతూ 14 ఏళ్ల కొడుకును పోషించేది. గత ఐదేళ్లుగా మత్తు పదార్థాలకు బానిసైన బాలుడు ప్రతిరోజూ వైట్‌నర్, గుడుంబా సేవించేవాడు. దీని కోసం డబ్బులు కావాలంటూ తల్లితో గొడవకు దిగేవాడు. చుట్టు పక్కలవారు కూడా పలుమార్లు అతన్ని మందలించినా మార్పురాలేదు.
మద్యం తాగించి..
శనివారం రాత్రి 10 గంటల సమయంలో తల్లికి మద్యం తీసుకువచ్చి ఇచ్చాడు. మద్యం సేవించిన తరువాత తల్లితో గొడవకు దిగాడు. చిత్తు కాగితాలు ఏరగా వచ్చిన డబ్బులో తనకు రావాల్సిన రూ.200 ఇవ్వాలంటూ తల్లిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె నిరాకరించడంతో దాడికి పాల్పడ్డాడు. కిందపడ్డ తల్లిని కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు ఏడ్చుకుంటూ ఇంటిబయట కూర్చున్నాడు. స్థానికులు ఈ ఘటనను గమనించి మంగళ్‌హాట్ పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్ సంజీవరావు, ఎస్సై వెంకట్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న రేణుక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 14 ఏళ్ల బాలుడు తల్లిని హత్య చేయడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.