'మియాపూర్ స్కాం వెనుక పెద్ద తలకాయలు'
హైదరాబాద్: మియాపూర్ భూ అక్రమాల వెనుక గోల్డ్‌స్టోన్ ప్రసాదే కాకుండా ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. గోల్డ్ స్టోన్ వెనుక ఉన్న వారెవరో తెలియాలంటే సీఐడీ విచారణతో సాధ్యం కాదన్నారు. 690 ఎకరాలు ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉన్నాయో ప్రభుత్వం బయట పెట్టడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జోక్యం చేసుకోవాలని, లేదంటే ఆయన హస్తం కూడా ఉన్నట్లు భావించాల్సి వస్తుందని జీవన్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈ కేసును వెంటనే ప్రభుత్వం సీబీఐకి అప్పగించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. సరైన విచారణ జరగకపోతే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, దీనిపై న్యాయపరంగా వెళతామని, ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇది మరో నయీమ్ కేసు అని, ఓటుకు నోటు, ఎంసెట్ లీకేజి కేసుల్లా దీన్నికూడా నీరుగార్చే ప్రయత్నం చేయొద్దు అన్నారు. నయీమ్ కేసుతో సంబంధాలున్నాయని తెలిసినా మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.