ఎమ్మెల్యేలూ... మీ హాజరు ఇదీ! | MLA ... This is your attendance! | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలూ... మీ హాజరు ఇదీ!

Published Sun, Dec 15 2013 5:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

MLA ... This is your attendance!

=గళమెత్తడం తర్వాత...హాజరూ అంతంతే...
 = నగరంలోనే ఉంటూ అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలు ఎక్కువే!
 = లిస్ట్‌లో మణెమ్మ టాప్  తర్వాత స్థానాల్లో నందీశ్వర్, విష్ణు

 
సాక్షి, సిటీబ్యూరో: 2009 మే లో ఆరంభమైన ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ పదవీకాలం మరో మూడు నెలల్లో ముగియనుంది. ఈ కాలంలో శాసనసభ 12 సార్లు(ప్రస్తుత సభ కాకుండా) సమావేశం కాగా 173 రోజుల పాటు శాసనసభా సమావేశాలు జరిగాయి. శాసనసభ రికార్డుల ప్రకారం 38.21 గంటల సమయం వృథా అయింది. 583 .29 గంటల పాటు సభా కాలం సాగింది.

ఈ సభలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 శాసనసభా స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులు రాజధాని నగరంలో నెలకొన్న సమస్యలపై అడపాదడపా గళం విప్పే ప్రయత్నం చేసినా  ఉద్యమాల నేపథ్యంలో మనవాళ్లకు దక్కిన సమయం కొంతే. అయితే గళాలు విప్పకపోయినా... ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే తమ నియోజకవర్గాల ప్రజలకు కనిపించేందుకు గానీ... పార్టీ పరంగా ‘మంద బలం’లో కనిపించేందుకైనా.... అసెంబ్లీకి హాజరవడం రివాజు. అయితే గ్రేటర్ ఎమ్మెల్యేలు పార్టీ కండువాలు కప్పుకొని ‘షో’ చేసే తొలిరోజు సమావేశాలకు హాజరై మిగతా రోజుల్లో అధిక శాతం ఢుమ్మా కొట్టిన వారే ఎక్కువ.

జిల్లాల్లో ప్రజల మధ్య ఉండి వందల కిలోమీటర్ల దూరంలో ఉండే హైదరాబాద్‌లోని శాసనసభకు హాజరు కాలేదంటే ఓ అర్థముంది. నగరంలోనే ఉంటూ పక్కనే ఉన్న శాసనసభకు సమావేశాల సమయంలో కూడా హాజరు కాని తీరు ప్రజల సమస్యల పట్ల, నగర అభివృద్ధి పట్ల అన్నింటికన్నా ముఖ్యంగా తమను ఎన్నుకొన్న నియోజకవర్గ వాసుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అద్ధం పడుతోంది.
 
శాసనసభకు హాజరైనా హాజరుకాకపోయినా... మన ఎమ్మెల్యేలకు నెలవారీగా
 వచ్చే జీత భత్యాల వివరాలివీ...
 నెల జీతం:     రూ. 12, 000
 నియోజకవర్గ భత్యం:    రూ. 83, 000
 వసతి భత్యం:    రూ. 25, 000
 ఒకవేళ శాసనసభకు హాజరై రిజిస్టర్‌లో
 సంతకం చేస్తే రోజుకు రూ. 800
 
 173 రోజుల్లో... 39 రోజులే మణెమ్మ హాజరీ...


 రాష్ట్ర 13వ శాసనసభ 2009 మేలో కొలువు దీరితే తొలి సమావేశాలు జూన్ 3 నుంచి ఐదు రోజుల పాటు సాగాయి. కొత్త మురిపెంతో ఒకటి రెండు రోజులు మినహా దాదాపుగా అన్ని రోజులు సభ్యులు హాజరయ్యారు. రెండో విడత జులై, ఆగస్టుల్లో సాగగా...అక్కడి నుంచే హాజరీ శాతం తగ్గడం మొద లై... 12వ సెషన్స్ వరకు కొనసాగుతూనే వచ్చింది. ఈ 12 సార్లు సమావేశమై 173 రోజులు సాగిన సభలో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి ఎన్నికైన టి. మణెమ్మ హాజరు కేవలం 39 రోజులే. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఆమె 2009 నుంచి 2011 వరకు గైర్హాజరు 76 రోజులు మాత్రమే కాగా, 2012 నుంచి ఇప్పటి వరకు 47 రోజుల సమావేశాలకు ఒక్కరోజు కూడా కాలేదు. ప్రస్తుతం సాగుతున్న 13వ విడత సమావేశాలకు కూడా ఆమె దూరంగానే ఉన్నారు.
 
 విష్ణూ  సార్... ఏంటి మీరూనా..?


 పి. జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రజల ఘోషను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఐదేళ్ల అసెంబ్లీ సమావేశాల రోజుల్లో ఆయన దాదాపు సగం రోజులు (80) హాజరు పట్టికలో సంతకం కూడా చేయలేదు. ఇదే కోవలో  పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చేరారు. ఆయన కూడా ఏకంగా 85 రోజులు శాసనసభకు రాలేదు. వీరి తర్వాత రాజేంద్రనగర్ నుంచి టీడీపీ తరఫున గ్రేటర్‌లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్(45 రోజుల గైర్హాజరు), సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ(41 రోజులు), చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ(40 రోజులు), కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(37 రోజులు)లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు.
 
 శాసనసభా పక్ష నేతలు సైతం...


 రాష్ట్ర అసెంబ్లీలో నగరానికి చెందిన అంబర్‌పేట ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి బీజేపీ శాసనసభా పక్ష నేతగా, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎంఐఎం పక్ష నేతగా కొనసాగుతున్నారు. లోక్‌సత్తా నుంచి ఏకైక ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ(కూకట్‌పల్లి) ఒ క్కరే. వీరిలో జయప్రకాశ్ నారాయణ ఒక్కరే ఆరు రోజులు మినహా ఇప్పటివరకు 12 విడతలుగా శాసనసభ కొనసాగినన్ని రోజులు హాజ రయ్యారు. ఇక బీజేపీ నేత కిషన్ రెడ్డి 24 రోజు లు, అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం పక్షనేత) ఏ కంగా 40 రోజులు సభకు హాజరు కాలేదు. అక్బరుద్దీన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో 2012లో హాజరీ శాతం తక్కువగా ఉందని చెప్పవచ్చు.
 
 పాషా ఖాద్రీ, ఆకుల రాజేందర్ భేష్


 చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికైన పాషా ఖాద్రీ ఈ 13వ శాసనసభలోనే అత్యధిక రోజులు సభకు హాజరైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయన 173 రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే సభకు హాజరుకాలే దు. ఆయన తర్వాత స్థానంలో మల్కాజిగిరి నుం చి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకుల రాజేంద ర్, నాంపల్లి ఎమ్మెల్యే విరాసత్ రసూల్‌ఖాన్ కేవ లం నాలుగురోజులు మాత్రమే సభకు రాలేదు. యాకుత్‌పురా ఎమ్మెల్యే మోజం ఖాన్ ఐదు రోజు లు తక్కువ గైర్హాజరీతో ఉన్నారు. వీరు సమస్యలపై గొంతెత్తకున్నా... సభకు సంఖ్యాబలంలో నైనా తమ వంతు సహకారం ఇచ్చారని చెప్పవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement